Movies

తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొట్టిన జవాన్‌

తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొట్టిన జవాన్‌

షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్‌’ (Jawan) కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటన్నింటినీ అందుకుని ప్రేక్షకులను మెప్పించింది. దీంతో థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.70కోట్లు (నెట్‌) కలెక్ట్‌ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.120కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. ఈ విషయాన్ని ట్రేడ్‌ ఎనలిస్టులు ట్వీట్‌ చేశారు. తొలిరోజు ఏకంగా 26లక్షల టికెట్స్‌ అమ్ముడయినట్లు వెల్లడించారు. ఇక బాలీవుడ్‌ చరిత్రలో ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘జవాన్‌’ నిలిచింది. అలాగే తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు సాధించిన రెండు బాలీవుడ్‌ చిత్రాలు షారుక్‌ ఖాన్‌వి (Shah Rukh Khan) కావడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘పఠాన్‌’ దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.57 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పగా ఇప్పుడు ‘జవాన్‌’ రూ.70 కోట్లతో దాన్ని అధిగమించింది. ఇక హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

మరోవైపు జవాన్‌ చిత్రబృందం కూడా ఈ విజయంతో సంబరాలు చేసుకుంటోంది. ట్విటర్‌ వేదికగా ప్రేక్షకులందరికీ షారుక్‌ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే దర్శకుడు అట్లీ (Atlee), అనిరుధ్‌లు కూడా ‘జవాన్‌’ హిట్‌పై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి ఫొటోలను పంచుకున్నారు. ఇక షారుక్‌ ఇందులో విక్రమ్‌ రాథోడ్‌, ఆజాద్‌గా ద్విపాత్రాభినయంలో కనిపించగా ఆయన సరసన నయనతార తనదైన నటనతో మెప్పించింది. అలాగే దీపికా పదుకొణె అతిథి పాత్రలో మెరిసింది.