అంతన్నారు ఇంతన్నారు.. అన్న చందంగా మారింది హైదరాబాద్‌లో మోకిలా భూముల వేలం ప్రక్రియ. గజానికి లక్షకు పైగా కుమ్మరించి వేలం పాడుకున్నవాళ్లు ఇప్పుడు పేమెంట్స్ దగ్గర చేతులెత్తేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిక నోటీసులు జారీ చేసింది హెచ్ఎండీఏ. భాగ్యనగరం శివార్లలోని మోకిలా భూముల వేలానికి సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హెచ్ఎండీఏ నిర్వహించిన ఈ భూముల వేలం సమయంలో ఆవేశపడ్డ బిడ్డర్లు.. ఆ తర్వాత వెనకడుగు వేస్తున్నట్లు తేలింది. గత నెలలో మోకిలా లేఔట్ ఫేస్-1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహిస్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో అత్యధికంగా గజం లక్షా ఐదు వేలకు అమ్ముడు బోయింది. సగటున గజం 80వేల రూపాయలు పైచిలుకు పాడుకున్నారు బిడ్డర్లు. కానీ.. తొలి ఇన్స్టాల్మెంట్గా చెల్లించాల్సిన 25 శాతం మొత్తాన్ని ఇంతవరకూ కట్టలేదంటూ పదిమంది H1 బిడ్డర్లకు నోటీసులు ఇచ్చింది హెచ్ఎండీఏ.
డబ్బు కట్టని వాళ్ల ప్లాట్ రద్దు చేయడమే కాదు.. ఇకముందు ఏ భూముల వేలంలోనూ పాల్గొనే అవకాశం లేకుండా బ్లాక్ లిస్టులో పెడుతున్నామని హెచ్చరించింది హెచ్ఎండీఏ. మోకిలా ఫేస్-2లో ప్లాట్లను వేలం పాడినవారు కూడా సరైన సమయంలో తొలి విడతగా 25 శాతం డిపాజిట్ సొమ్ము చెల్లించకపోతే.. వాళ్లకూ ఇదే పరిస్థితి తప్పదని ప్రెస్‌నోట్ విడుదల చేసింది. గడువు పొడిగించడం, మినహాయింపులివ్వడం లాంటివి జరగవని, క్యాన్సిలేషన్ లెటర్లు కూడా జారీ చేశామని ఘాటుగా ప్రకటించింది హెచ్ఎండీఏ. మోకిలా లేఔట్ మిగతా దశల్లో జరిగిన వేలంలో ఎంతమంది డిఫాల్టర్లుగా తేలతారు… అనేది సస్పెన్స్‌గా మారింది. మొత్తమ్మీద.. మోకిలా లేఔట్లో భూముల వేలం అనేది ఒక ప్రహసనంగా ముగిసిందంటూ రియలెస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక మోకిలా ఫేజ్-2 వేలంలోనూ భూముల ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండో దశలోలో ఐదు రోజులపాటు 300 ప్లాట్లను రోజుకు 60 చొప్పున వేలం వేశారు. సరాసరిన ఒక్కో ప్లాటులో గజానికి 50వేల రూపాయల పైన రేటు పలికిందంటే నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో సైతం భూముల ధర ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు అత్యధికంగా చదరపు గజం లక్ష పలికితే ఆ తర్వాత రోజుల్లో దానికి చేరువలో వచ్చి చేరాయి. రోజుకు 60 ప్లాట్లు అమ్మితే 100 కోట్లపైనే ఆదాయం వచ్చి చేరింది. నాలుగు రోజులకు 492 కోట్ల రూపాయల ఆదాయం రాగా.. ఐదో రోజు కూడా 60 ప్లాట్లకు 100 కోట్లు దాటనుంది. మొత్తం 300 ప్లాట్లకు 600 కోట్ల రూపాయల భారీ ఆదాయం సర్కారు ఖజానాకు చేరనుంది. చదరపు గజానికి 25వేల రూపాయల అప్సెట్ ప్రైస్ నిర్ణయించగా… సరాసరిన ఈ 300 ప్లాట్లకు రెండు రెట్లు ఎక్కువ రేటు పలికిందనే చెప్పాలి. ఎక్కడ ప్రభుత్వం వేలం వేసినా బిడ్డర్లు పోటీపడి వేలంపాటలో పాల్గొంటున్నారు. నగర శివార్లలోని భూములను డెవలప్ చేసి HMDA ప్లాట్లను వేలం వేస్తోంది. ఓఆర్ఆర్కు సమీపంలో ఉండడడ, ఎయిర్‌పోర్ట్‌తో కనెక్టివిటీ ఉండడం సర్కారే సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఎలాంటి చిక్కులు ఉండవని కొనేవాళ్లు భావిస్తున్నారు. సర్కారు క్లియర్ టైటిల్ తో భూములను అమ్ముతుండడంతో వివాదాలు లేని ప్లాట్లను సొంతం చేసుకునేందుకు ఔత్సాహికులు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు.