Politics

నన్ను మానసికంగా వేధించారు

నన్ను మానసికంగా వేధించారు

సీఐడీ కస్టడీలో తనను పోలీసులు మానసికంగా చాలా వేధించారని, ఆదివారం ఉదయం 6 గంటల వరకు రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని అనిశా కోర్టు న్యాయమూర్తి ఎదుట తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. పోలీసులు తనను ఇంటరాగేట్‌ చేస్తున్న దృశ్యాలను దురుద్దేశపూర్వకంగా ప్రత్యక్ష ప్రసారం చేయించారని, ఆ అధికారం వారికి లేదన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు… ఆదివారం ఉదయం విజయవాడలోని అనిశా కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయాధికారి హిమబిందు ఎదుట ఆయన వాంగ్మూలమిచ్చారు. సీఐడీ కస్టడీలో ఉండగా తనకు మొదట ఒక వైద్యుడు పరీక్షలు చేశారని, తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తనకు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినట్లు పరీక్షల్లో తేలిందన్నారు. చంద్రబాబును ఈ నెల 22 వరకు రిమాండ్‌కు పంపుతూ అనిశా కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల పూర్తి కాపీ సోమవారం బయటకు వచ్చింది. కోర్టులో చంద్రబాబు ఇచ్చిన వాంగ్మూలం వివరాలు అందులో ఉన్నాయి. మిమ్మల్ని ఏ సమయంలో అరెస్ట్‌ చేశారన్న న్యాయాధికారి ప్రశ్నకు.. ‘నేను బస చేసిన ప్రదేశాన్ని శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి పోలీసులు ముట్టడించారు. శనివారం తెల్లవారుజామున 5.00- 5.30 గంటల సమయంలో సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి, కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ్‌ నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారు. వారి రాకకు కారణమేమిటని అడిగితే… అరెస్ట్‌ నోటీసు అందించారు. కేసు వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసులు మీతో దురుసుగా ప్రవర్తించారా? అన్న ప్రశ్నకు… ‘శారీరకంగా ఇబ్బంది పెట్టలేదుగానీ మానసికంగా వేధిస్తూనే ఉన్నారు’ అని బదులిచ్చారు. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చారా? అన్న ప్రశ్నకు.. ‘మొదట ఎఫ్‌ఐఆర్‌, అరెస్ట్‌ నోటీసులే ఇచ్చారు. కోర్టులో హాజరుపరచడానికి కొంచెం ముందు మాత్రమే రిమాండ్‌ నోటీసు అందించారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తనను అరెస్ట్‌ చేశారని, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారి కాకపోయినా సీఐడీ డీఐజీ తనను ఇంటరాగేట్‌ చేశారని, ఆ అధికారంఆయనకు లేదని చంద్రబాబు అన్నారు.

“తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. కరడుగట్టిన నేరగాళ్ల మధ్య ఆయన్ను జైల్లో ఉంచటం సురక్షితం కాదు. అక్కడ ఆయనకు ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు మాకున్నాయి. ఆయన భద్రతపై ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ‘హౌస్‌ అరెస్టు’లో ఉంచేలా ఆదేశాలివ్వండి’’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు చంద్రబాబు తరఫున విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో దాఖలుచేసిన పిటిషన్‌పై సోమవారం ఆయన సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ‘‘చంద్రబాబు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తి. ఇప్పటివరకూ ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్నారు. జైల్లో భద్రత ఉండదు. ఆయన వయసు 73 ఏళ్లు. తీవ్ర మధుమేహం, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని జ్యుడిషియల్‌ కస్టడీ కాలంలో హౌస్‌ అరెస్టులో ఉంచేలా ఆదేశాలివ్వండి. చంద్రబాబును అరెస్టుచేసిన కేసుపై ఆయన నివాసంలో ఇప్పటివరకూ సోదాలు జరగలేదు. అక్కడేమీ సీజ్‌ చేయలేదు. ఈ కేసు దర్యాప్తుతో ఆయన ఇంటికి సంబంధం లేదు. ఆయన్ను హౌస్‌ అరెస్టులో ఉంచటం వల్ల ఆధారాలు మాయమవుతాయనే ఆందోళనే అక్కర్లేదు.’’ అని లూథ్రా వివరించారు. 70 ఏళ్ల మానవ హక్కుల కార్యకర్త గౌతమ్‌ నవలఖను హౌస్‌ అరెస్టులో ఉంచేందుకు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని ప్రస్తావించారు. సీఐడీ తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు దఫాలుగా ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం న్యాయాధికారి హిమహిందు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.