Business

11శాతం పెరిగిన వెండి ధర-వాణిజ్యం

11శాతం పెరిగిన వెండి ధర-వాణిజ్యం

* ప్రస్తుతం పసిడి కంటే వెండి ధర ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గత నాలుగు నెలల్లోనే కిలో వెండి ధర 11 శాతం పెరిగింది. ప్రసుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.73,000 వరకు పలుకుతోంది. డిమాండ్‌ ఇలానే కొనసాగితే వచ్చే 12 నెలల్లో కిలో వెండి ధర రూ.82,000 నుంచి రూ.85,000 స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. ఒకవేళ తగ్గినా రూ.68,000 -70,500 వద్ద గట్టి మద్దతు లభిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు ప్రతి తగ్గుదలలో వెండి కొనిపెట్టుకోవడం మంచిదని సిఫారసు చేసింది.

* విద్యుత్‌ వాహనాలకు ప్రత్యేక సేల్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసే విషయాన్ని టాటా మోటార్స్‌ పరిశీలిస్తోంది. పర్యావరణహితమైన వాహనాలు కొనుగోలు చేయడంపై ఆసక్తి గల వినియోగదారులకు భిన్నమైన అనుభూతిని కల్పించడం లక్ష్యంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని కార్యరూపంలోకి తేవాలనుకుంటున్నట్టు టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాల విభాగం మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. టాటా మోటార్స్‌ గురువారం నాడు తాజా గా కొత్తగా మెరుగులు దిద్దిన నెక్సాన్‌ ఈవీ, నెక్సాన్‌ (ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌, ఐసీఈ) వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీ విక్రయాలు అధికంగా ఉంటున్న నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రత్యేక సేల్స్‌ నెట్‌వర్క్‌లు ప్రారంభిస్తామని చెప్పారు.

* సన్‌ ఫార్మా త్వరలో టివల్జీ అనే ఒక సరికొత్త ఔషధాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇందుకోసం సన్‌ ఫార్మాకు చెందిన ఒక అనుబంధ సంస్థ అమెరికా కేంద్రంగా పని చేసే ఫార్మాజ్‌ అనే బయోఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఫార్మాజ్‌ తాను అభివృ ద్ధి చేసిన సోవాటెల్‌టైడ్‌ అనే ఔషధాన్ని విక్రయించేందుకు సన్‌ ఫార్మాకు లైసెన్సు ఇస్తుంది. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడంతో ఏర్పడే సమస్యల నివారణకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది.

* హైదరాబాద్‌కు చెందిన సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో రూ.9,589 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎ్‌ఫడీఐ) ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సైప్ర్‌సకు చెందిన బెర్హాండా లిమిటెడ్‌ ఈ పెట్టుబడులను పెట్టనుంది. సువెన్‌ ఫార్మా ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు, తద్వారా మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఈ నిధులను వినియోగించుకోనుంది. మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీతోపాటు ఆర్‌బీఐ, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పరిశీలించాకే ఈ ఎఫ్‌డీఐ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) బుధవారం నాటి సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

* రష్యా బ్యాంకుల్లో చిక్కుకుపోయిన 60 కోట్ల డాలర్ల డివిడెండ్‌ లాభాలను ఉపయోగించుకునేందుకు భారత ఆయిల్‌ కంపెనీలు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డాలర్లతో రష్యా నుంచి చమురు దిగుమతికి ఉన్న అవకాశాలను చురుగ్గా పరిశీలిస్తున్నాయి. రష్యా చమురు, గ్యాస్‌ క్షేత్రాల్లో పెట్టుబడి పెట్టిన ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలకు ఈ డివిడెండ్‌ ఆదాయం వచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. దీంతో డాలర్లను భారత కంపెనీలు స్వదేశానికి తరలించలేకపోయాయి.

* సొడెక్సో ఇండియా ఆఫీస్‌ ఫుడ్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌ సమీపంలో ఆఫ్‌సైట్‌ మాస్టర్‌ కిచెన్‌ ఏర్పాటు చేసింది. ఈ కిచెన్‌ ద్వారా వివిధ కంపెనీలకు చెందిన 25,000 మంది ఉద్యోగులకు రోజూ బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌, స్నాక్స్‌ అందించవచ్చు. తమ మొత్తం ఆదాయంలో 10 శాతం ఈ విభాగం ద్వారా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సొడెక్సో ఇండి యా ఎండీ సంబిత్‌ సాహ ఒక ప్రకటనలో తెలిపారు. కిచెన్‌ సదుపాయం లేని కంపెనీల ఉద్యోగులకు శుచి, శుభ్రతతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం తమ లక్ష్యమన్నారు. ఈ మాస్టర్‌ కిచెన్‌ వ్యవస్థను త్వరలో బెంగళూరు,పుణె, ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకూ విస్తారించాలని కంపెనీ భావిస్తోంది.