* భారత్ ఎగుమతులు వరుసగా ఏడవ నెలలోనూ క్షీణబాటలోనే కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86 శాతం తగ్గుదలతో 34.48 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. విదేశాల్లో పెట్రోలియం, జెమ్స్, జ్యువెలరీ తదితర కీలక ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో ఎగుమతులు క్షీణించాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఇదే నెలలో దిగుమతులు సైతం 5.23 శాతం తగ్గి 58.64 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు తగ్గడం వరుసగా ఇది తొమ్మిదవ నెల.
* ఔషధ పరిశ్రమలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన నూతన షెడ్యూల్ ఎం (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలను త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు. ‘షెడ్యూల్ ఎం’, దాదాపుగా ‘డబ్ల్యూహెచ్‌ఓ- జీఎంపీ’ ప్రమాణాలకు సమానం. దీన్ని అమలు చేయడానికి చిన్న ఫార్మా యూనిట్లకు 6 నెలలు, పెద్ద ఫార్మా సంస్థలకు 12 నెలలు గడువు విధించారు. దీనివల్ల దేశీయ మార్కెట్లో ఔషధాల నాణ్యత పెరగడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో అధిక మార్కెట్ వాటాను మన దేశానికి చెందిన ఫార్మా సంస్థలు సాధించే అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి(ఎంఎస్‌ఎంఈ) ఫార్మా యూనిట్లకు ఈ కొత్త తయారీ ప్రమాణాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఫార్మాగ్జిల్(ఫార్మాసూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) శుక్రవారం అహ్మదాబాద్‌లో ఒక సదస్సు నిర్వహించింది. ‘క్వాలిటీ కాంప్లియన్స్ అండ్ పేషెంట్ సేఫ్టీ’ అనే పేరుతో నిర్వహించిన ఈ సదస్సుకు సీడీఎస్‌సీఓ, ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ), యూఎస్‌ఫార్మాకోపియా (యూఎస్‌పీ), ఇంటర్నేషనల్ ఫార్మాసూటికల్ ఎక్సిపియంట్స్ కౌన్సిల్ (ఐపీఈసీ)- ఇండియా, ఫార్మాగ్జిల్ అధికార్లు, ప్రతినిధులు హాజరయ్యారు. ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్, ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) జాతీయ అధ్యక్షుడు విరంచి షా, సీడీఎస్‌సీఓ- అహ్మదాబాద్ డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ రవికాంత్ శర్మ, ఎఫ్‌డీసీఏ- గుజరాత్ కమిషనర్ హెచ్.జి.ఖోస్లా తదితరులు ఈ సదస్సులో మాట్లాడారు. ఫార్మా పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఇటువంటి అవగాహన సదస్సులను వచ్చే ఆరు నెలల వ్యవధిలో హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా పది నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించారు.
* షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా? మరి మీ డీమ్యాట్ (Demat) ఖాతాకు నామినీని ఎంచుకున్నారా? లేనట్లయితే ఈ నెలాఖరులోగా (సెప్టెంబరు 30) ఆ పనిని పూర్తిచేయండి. లేకపోతే మీ ఖాతాలు స్తంభించిపోతాయి. చాలామంది డీమ్యాట్ ఖాతా ప్రారంభించినప్పుడు, మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే సమయంలో నామినీ పేరును పేర్కొనరు. పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఏమైనా అనుకోనిది జరిగితే ఖాతాలో ఉన్న పెట్టుబడులు, ఫండ్ యూనిట్లను వారసులు క్లెయిం చేసుకోవడం కష్టమవుతోంది. ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు నామినీ వివరాలను జతచేయటం తప్పనిసరిచేస్తూ సెబీ సర్క్యులర్ జారీ చేసింది. డీమ్యాట్ ఖాతా ఉన్నవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నామినీని ఎంచుకోవాల్సిందే అని పేర్కొంది. 2023 మార్చి 31తో ముగియనున్న గడువును 2023 సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ సెబీ (SEBI) నిర్ణయం తీసుకుంది. అయితే నామినీ వివరాలను అందించాల్సిన సెక్షన్లలో రెండు ఆప్షన్లు సెబీ తీసుకొచ్చింది. ఒకటోది నామినీ వివరాలు నమోదు ఎంపిక చేసుకునే ఆప్షన్ కాగా.. నామినీని ఎంచుకోవడం లేదనేది రెండో ఆప్షన్. ఇందులో ఖాతాదారులకు కావల్సిన ఆప్షన్‌ను ఎంచుకొనే వెసులుబాటు ఉంది. రెండింట్లో ఏదో ఒక దాన్ని మాత్రం కచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణంచేత నామినీ ఎంపికలను మరచిపోతే ఖాతాలు స్తంభించిపోతాయి.
* టాటామోటార్స్ లిమిటెడ్ తన ప్రస్తుత మోడళ్లైన ఆల్టోజ్, హారియర్, సఫారీ, ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ వంటి డీజిల్ ఆధారిత వేరియంట్‌లను మార్కెట్ డైనమిక్స్, రెగ్యులేషన్స్ అనుమతి ఉన్నంత వరకు ఉత్పత్తిని కొనసాగిస్తామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర అన్నారు. గత రెండు రోజుల కిందట కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ప్రకటనపై ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో డీజిల్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని, దీని వల్ల కాలుష్యాన్ని నివారించేందుకు దోహదపడుతుందని గడ్కరీ అన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు డీజిల్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని, లేకపోతే డీజిల్ వాహనాలపై 10 శాతం జీఎస్టీ విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటనపై టాటా ఎండీ శైలేష్ చంద్ర స్పందించారు. తాము ఈ వాహనాలు మార్కెట్లో డిమాండ్ ఉన్నంత వరకు కొనసాగిస్తామని, 2040 సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని నిలిపివేసే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
* దేశంలో నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝులిపిస్తుంటుంది. భారీ ఎత్తున జరిమానా విధిస్తుంటుంది. గుజరాత్‌లోని మూడు బ్యాంకులతో సహా దేశంలోని నాలుగు బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) భారీ జరిమానాలు విధించింది. ఈ బ్యాంకులు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోలేదు. దర్యాప్తు సమయంలో ఈ బ్యాంకులు మార్గదర్శకాలను పాటించలేదని, దీనివల్ల భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. సహకార బ్యాంకులుగా ఉన్న ఈ నాలుగు బ్యాంకుల పేర్లను దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది . రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం.. జరిమానా విధించబడిన బ్యాంకుల్లో బారామతి కోఆపరేటివ్ బ్యాంక్, బెచరాజీ సిటిజన్స్ కోఆపరేటివ్ బ్యాంక్, వాఘోడియా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మరియు విరామ్‌గామ్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నాయి.
బారామతి కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 2 లక్షల రూపాయలు
బేచరాజీ సిటిజన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 2 లక్షల రూపాయలు
వాఘోడియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు 5 లక్షల రూపాయలు
విరామ్‌గాం మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.5 లక్షల రూపాయల జరిమానా విధించారు.