‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ అనేది రాజ్యాంగం, సమాఖ్య నిర్మాణంపై దాడేనని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మండిపడ్డారు. ‘జమిలి ఎన్నికల’ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా చిదంబరం శనివారం జైరాం రమేశ్, పవన్ ఖేడాలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నికల’కు కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం. చట్టసభల్లో ఈ రాజ్యాంగ సవరణలను ఆమోదించేంత బలం భాజపా కు లేదని ఆ పార్టీకి తెలుసు. అయినప్పటికీ.. దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, తప్పుడు కథనాలను సృష్టించేందుకే దీన్ని ముందుకు తెస్తోంది’ అని చిదంబరం విమర్శించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్లు జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ తీర్మానాలు సంతాపానికి సంబంధించినవేనని చెప్పారు. ఇటీవల కన్నుమూసిన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతోపాటు మణిపుర్ హింసాకాండ, హిమాచల్‌ప్రదేశ్ విపత్తులో మృతి చెందిన పౌరులకు సంతాపం ప్రకటించినట్లు తెలిపారు. హిమాచల్‌లో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన విపత్తును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని డిమాండ్ చేశామన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులతోపాటు అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల రోడ్‌మ్యాప్ ఖరారుకు, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.