ScienceAndTech

కృత్రిమ మేథతో మాకు ప్రయోజనాలు ఉన్నాయి: ఐటీ ఉద్యోగులు

కృత్రిమ మేథతో మాకు ప్రయోజనాలు ఉన్నాయి: ఐటీ ఉద్యోగులు

పనిలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై హైదరాబాద్‌లోని మెజారిటీ వృత్తి నిపుణులు అమితాసక్తి కనబరుస్తున్నారని ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ఇన్‌ తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియకపోయినప్పటికీ, ఏఐ గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నట్లు తమ సర్వేలో పాల్గొన్న ప్రతి పదిలో 7 మంది (69 శాతం) తెలిపారు. ఏఐతో పనితీరు గణనీయంగా మెరుగవుతుందని ప్రతి 10 మంది ప్రొఫెషనల్స్‌లో 8 మంది (79 శాతం) అభిప్రాయపడ్డారని రిపోర్టు పేర్కొంది. చాట్‌ జీపీటీ వంటి జనరేటివ్‌ ఏఐ సాంకేతికతను తమ పనిలో ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు 64 శాతం మంది వెల్లడించారు. ప్రతి ఇద్దరిలో ఒక్కరు చాట్‌జీపీటీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. అయితే, కృత్రిమ మేధతో పని చేసే చోట వచ్చే మార్పులను అందుకోలేకపోతామేమోనని మాత్రం 42 శాతం మంది ప్రొఫెషనల్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే, పనిలో చాట్‌జీపీటీ వినియోగిస్తున్న వారిలో మిలీనియల్సే (54 శాతం) అధికం. జనరేషన్‌ జెడ్‌ (46 శాతం) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. 1981-1996 మధ్యకాలంలో జన్మించిన వారిని మిలీనియల్స్‌, 1996-2010 మధ్య జన్మించిన వారిని జనరేషన్‌ జెడ్‌గా పిలుస్తారు.