భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అయితే, గతంలోనూ ఆయన పలుమార్లు ఇలాంటి వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలిచారు.
ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ఆరోపిస్తూ దిల్లీతో ఉద్రిక్తతలను మరింత పెంచారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అయితే, ట్రూడో ఇలా వివాదాలతో వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2015లో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుమార్లు ఆయనను వివాదాలు చుట్టుముట్టాయి. భారత్ పర్యటనలో విమర్శలు.. పార్లమెంట్‌లో మహిళా ఎంపీని తోసేయడం ఇలా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.
2016లో ట్రూడో ఓసారి పార్లమెంట్‌లో అనుచితంగా ప్రవర్తించారు. విపక్ష నేతల ఆరోపణలతో విసిగిపోయిన ట్రూడో.. ఓ ప్రతిపక్ష సభ్యుడిని పట్టుకునేందుకు తన స్థానం నుంచి వేగంగా దూసుకెళ్లారు. ఆ క్రమంలో ఓ మహిళా ఎంపీని ఆయన నెట్టేశారు. ట్రూడో మోచేయి ఆమె ఛాతిని బలంగా తాకింది. దీనిపై పలుమార్లు క్షమాపణలు తెలిపిన ట్రూడో.. ప్రపంచంలోనే అత్యంత ఒత్తిడితో పనిచేస్తున్న వ్యక్తిని తానేనంటూ చెప్పడం గమనార్హం.
2018 ఫిబ్రవరిలో ట్రూడో కుటుంబం ఎనిమిది రోజుల పాటు భారత్‌లో పర్యటించింది. అయితే, ఆ సమయంలో ట్రూడో భారీగా విమర్శల పాలయ్యారు. అప్పట్లో ఆయన గౌరవార్థం కెనడా హైకమిషన్ ఇచ్చిన విందుకు మాజీ ఖలిస్థానీ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్‌ను ఆహ్వానించారు. ఇది ట్రూడోను దౌత్యపరమైన చిక్కుల్లోకి నెట్టింది. ఈ ఘటనల కారణంగా భారత్ ప్రభుత్వం అప్పట్లో ఆయన పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అధికారిక కార్యక్రమాలు తక్కువగా జరిగాయి. పర్యటక ప్రాంతాల సందర్శన కోసం ట్రూడో భారత్ వెళ్లినట్లుందని స్వదేశంలో విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇక, ఆ పర్యటనలో ఆయన ఎక్కువ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కన్పించారు. భారత అధికారులతో సమావేశాల సమయంలో ఆయన కుర్తా పైజామాలో కన్పించడం విమర్శలకు దారితీసింది. కెనడాలో సిక్కు ఓటర్ల కోసమే ఆయన అలా ప్రవర్తించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.