Politics

ఏపీలో మద్యం కుంభకోణం:పురందేశ్వరి

ఏపీలో మద్యం కుంభకోణం:పురందేశ్వరి

రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. మద్యం తయారీ, సరఫరాపై రాష్ట్రప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘‘లిక్కర్‌ బాండ్ల ద్వారా రాష్ట్రప్రభుత్వం రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చింది. మద్యం తయారీ కంపెనీల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.300-400 కోట్ల ముడుపులు అందుతున్నాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక… 2024 నాటికి మద్యం విక్రయాలను ఐదు నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేసి, ఆ తర్వాతే ఓట్ల కోసం మీ వద్దకు వస్తానని జగన్‌ చెప్పారు. మద్యం తయారీ కంపెనీల యజమానులను బెదిరించి, అధికారపార్టీ ముఖ్యనేతలు వాటిని చేజిక్కించుకున్నారు. లీటరు మద్యం రూ.15కు తయారవుతుంటే… రూ.600 నుంచి రూ.800 మధ్య విక్రయిస్తున్నారు. రూ.25వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయి? గతంలో రాష్ట్రప్రభుత్వానికి మద్యం ద్వారా ఏడాదికి రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తే వైకాపా పాలనలో ఇది రూ.32 వేల కోట్లకు పెరిగింది. రోజుకు 80 లక్షల మంది మద్యం తాగుతున్నారు. ఒక్కొక్కరు రూ.200 చొప్పున ఖర్చుపెడితే… రూ.160 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. నెలకు రూ.4,800 కోట్లు. ఏడాదికి రూ.57,600 కోట్లు. బడ్జెట్లో రూ.32 వేల కోట్లే ఆదాయంగా చూపిస్తున్నారు. మిగిలిన రూ.25వేల కోట్లు ఏమైంది.. ఎక్కడికెళ్తోంది? దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని పురందేశ్వరి అన్నారు.