DailyDose

కెనడాలో భారత హిందువులకు ఖలిస్థాని బెదిరింపులు-నేరవార్తలు

కెనడాలో భారత హిందువులకు ఖలిస్థాని బెదిరింపులు-నేరవార్తలు

* ఇండియాకు వెళ్లిపోవాలని కెనడాలోని భారతీయ హిందువులను ఖలిస్థాన్ ఉగ్రవాది బెదిరించాడు. కెనడా పట్ల, ఆ దేశ రాజ్యాంగం పట్ల విధేయతను భారతీయ హిందువులు తిరస్కరించారని నిషేధిత ఖలిస్థాన్ అనుకూల గ్రూప్, సిక్స్‌ ఫర్ జస్టిస్ నాయకుడు, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆరోపించాడు. ఖలిస్థాన్ అనుకూల సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నారని తెలిపాడు. అలాగే వారు ఎప్పుడూ కెనడా వైపు ఉంటారని, ఎల్లప్పుడూ ఆ దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని సమర్థించారని చెప్పాడు. ‘మీ గమ్యం భారత్‌. కెనడా వదిలి భారతదేశానికి వెళ్ళండి’ అని కెనడాలోని భారతీయ హిందువులును తాజా వీడియోలో బెదిరించాడు. కాగా, జూన్‌లో కెనడా భూభాగంలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని, నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆరోపించారు. భారత్‌ను రెచ్చగొట్టడం లేదన్న ఆయన, నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో కెనడా, భారత్‌ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్య అధికారులను బహిష్కరించాయి. అయితే కెనడా ఆరోపణలను భారత్‌ ఖండించింది. అలాగే కెనడాలోని భారతీయులు, విద్యార్థులు, ఆ దేశానికి వెళ్లే పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం సూచన జారీ చేసింది.

* రాజస్థాన్‌లోని పహాడీ సబ్‌ డివిజను పరిధిలో ఓ వితంతువును వంచించిన ఆరుగురు కామాంధులు 14 రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారం సాగించారు. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాధారంగా మారిన ఆమెకు ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి చేరువయ్యాడు. తన అయిదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నిన ఆ వ్యక్తి.. ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు తీసుకువెళ్లాడు. బాధితురాలిని అక్కడే నిర్బంధించి ఈ ఆరుగురూ అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. వారి ఉచ్చు నుంచి బయటపడిన ఆమె కామా పోలీసుస్టేషనులో నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ దేశ్‌రాజ్‌ కుల్దీప్‌ తెలిపారు.

* నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద కారు అదుపు తప్పి బైకును ఢీకొట్టింది. ఆ తర్వాత కారు సైతం రోడ్డుపై పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు సైతం మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను దేవరకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

* అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతోపాటు ప్రియురాలని వేధిస్తున్నందుకు సీనియర్‌ అధికారిని ఒక క్లర్క్‌ హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురంలో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల మహేష్‌ కుమార్‌ సర్వే ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఆఫీసర్ కాంప్లెక్స్‌లో సీనియర్ సర్వేయర్. అప్పుగా తీసుకున్న రూ.9 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని, తన ప్రియురాలిని కూడా అతడు వేధిస్తున్నాడని క్లర్క్‌ అనీష్‌ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో మహేష్‌ను హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు. కాగా, ఆగస్ట్‌ 28న అనీష్‌ సెలవు తీసుకున్నాడు. లజ్‌పత్ నగర్‌లోని మార్కెట్‌లో పాలిథిన్ షీట్, పార కొనుగోలు చేశాడు. ఆర్కే పురం సెక్టార్‌ 2లోని తన నివాసంలో కలుద్దామంటూ మహేష్‌ కుమార్‌ను పిలిచాడు. అక్కడకు వచ్చిన ఆ సీనియర్‌ అధికారి తలపై పైప్‌ రెంచ్‌తో కొట్టి హత్య చేశాడు. అనంతరం సొంతూరైన హర్యానాలోని సోనిపట్‌కు బైక్‌పై పారిపోయాడు. మరునాడు ఢిల్లీకి తిరిగి వచ్చాడు. రాత్రి వేళ క్వాటర్స్‌లోని ఆవరణలో గొయ్యి తవ్వి మహేష్‌ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అక్కడ సిమెంట్‌తో కప్పేశాడు. మరోవైపు మహేష్‌ కుమార్‌ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. సెప్టెంబర్‌ 2న మహేష్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లర్క్‌ అనీష్‌ను అరెస్ట్‌ చేయగా చేసిన నేరాన్ని అతడు ఒప్పుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

* మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల సెల్‌ ఫోన్లలో సినీ ప్రముఖుల నంబర్లు ఉండటం సంచలనంగా మారింది. వీరి కార్యకలాపాలను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తొలుత నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి రేవ్‌ పార్టీలకు సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మత్తుపదార్థాలు ఎరవేసి అమ్మాయిలను రప్పించడం, ప్రముఖుల పరిచయాలను పెంచుకోవడం వీరి దందాలో అసలు ఎత్తు. అనంతరం వీరిని అడ్డుపెట్టుకొని సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తుతున్నారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల అసలు రూపాలు ఇవే. రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు నిందితుల కాల్‌ డేటాలో పలువురు సినీ రంగ ప్రముఖుల ఫోన్‌ నంబర్లను గుర్తించారు. నిందితులు బాలాజీ, రాంకిశోర్‌, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాలో ఈ వివరాలు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో దర్యాప్తును ముమ్మరం చేసింది.

* నాంపల్లి కోర్టులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. నాంపల్లి కోర్టు భవనం పై నుంచి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి కిందకు దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడని చెబుతున్నారు పోలీసులు. సూసైడ్ అటెంప్ట్ చేసిన వ్యక్తిని వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన సలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. సెప్టెంబర్ 20న నాంపల్లి కోర్టులో పేషీ ఉండటంతో అతడిని తీసుకొచ్చారు.