Politics

భాజపా పొత్తు జనసేనతో మాత్రమే-తాజావార్తలు

భాజపా పొత్తు జనసేనతో మాత్రమే-తాజావార్తలు

* చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని.. కలిసే ఎన్నికలకు వెళ్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోజున తెలిపారు. అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యల అనంతరం మిత్ర పక్షమైన బీజేపీ పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.. పవన్ కల్యాణ్ సూచనతో మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా..? లేక బీజేపీ వేరేగా పోటీ చేస్తుందా..? అనే విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు మాత్రమే పొత్తులపై పార్టీలో చర్చ జరుగుతుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతానికి ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. టీడీపీతో పొత్తుపై జాతీయ నాయకత్వంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చర్చించిన తర్వాత బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి స్పష్టంచేశారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తు ఉందని.. ఎన్నికల సమయంలోనే పొత్తులపై తుది నిర్ణయం వస్తుందని తెలిపారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు.

* మోడీ అవకాశం వస్తే తెలంగాణ పై విషం చిమ్ముతారని, తెలంగాణ-ఎపి విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని మోడీ చెప్పారు అని గుర్తుచేశారు మంత్రి హరీష్ రావు. మోడీ కడుపులో ఉన్న విషాన్ని బయటికి కక్కుతున్నారని, మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారని మండిపడ్డారు. బిజెపివి అన్ని అబద్ధాలేనని, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై విష ప్రచారాలు మానుకోవాలని సూచించారు మంత్రి హరీష్ రావు. మరో వైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై స్పందించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిదని, ఆ పార్టీ 6 గ్యారెంటీలు ఏమో కాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం 6 నెలలకు ఓ సీఎం వస్తారు అని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో కర్ఫ్యూ వస్తుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సెకండ్ హైకమాండ్ బెంగళూరులో తయారైందని, కాంగ్రెస్ వాళ్లు వస్తే రెండో రాజధాని బెంగళూరు అవుతుందని, ఢిల్లీకి కాంగ్రెస్ వాళ్లు క్యూ కడతారన్నారు.

* దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళా రిజర్వేషన్ల గురించే చర్చ జరుగుతోంది. కొత్త పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లుగా 108వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా రిజర్వేషన్ల బిల్లు) ప్రవేశపెట్టడంతో రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయ నిపుణులు ఇదే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరి ఇంతకీ ఈ బిల్లు అమలైతే.. సమాజంలో ఏ వర్గం మహిళలకు ఎన్ని సీట్లు వస్తాయి? చట్టసభల్లో ఇప్పటికే అమలవుతున్న షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) రిజర్వేషన్లలో కూడా ఈ మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయా? మరి అలాంటప్పుడు మొత్తం 33 శాతం రిజర్వేషన్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? దేశంలో చట్టసభల్లో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్‌ను రాజ్యాంగం కల్పించింది. రెండు వర్గాలకు కలిపి సుమారు 24% రిజర్వేషన్ అమలవుతోంది. లోక్‌సభ గణాంకాలను చూస్తే మొత్తం ఎన్నికలు జరిగే 543 నియోజకవర్గాల్లో 84 సీట్లు ఎస్సీలకు, 47 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ రెండు వర్గాలకు కలిపి 131 సీట్లు రిజర్వ్ అవగా.. మిగిలిన 412 సీట్లను జనరల్ కేటగిరీగా పేర్కొంటున్నాం. రిజర్వ్ స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన నేతలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. జనరల్ సీట్లలో ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇప్పుడు కొత్తగా 33% సీట్లను మహిళలకు రిజర్వు చేస్తే.. ఇప్పటికే అమలవుతున్న 24% ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అదనంగా ఈ 33% కలిస్తే మొత్తం రిజర్వేషన్లు 57%కు చేరతాయి.

* అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌, ఇతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

* కృష్ణా ట్రైబ్యునల్‌ తీర్పు పాలమూరు విజయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై కృష్ణా ట్రెబ్యునల్‌ తీర్పును మంత్రి స్వాగతించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90టీఎంసీల వరకు కృష్ణా జలాలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

* మహిళా రిజర్వేషన్‌ బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మాదాపూర్‌లో ఇంటర్నేషనల్‌ టెక్‌పార్క్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై స్పందించారు. చాలా మంది మహిళా నేతలు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

* పార్లమెంటు కొత్త భవనంలోకి ఎంపీలు అడుగుపెట్టిన సమయంలో వారికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. అయితే, అందులోని పీఠికలో సోషలిస్ట్‌, సెక్యులర్‌ పదాలు లేకపోవడం వివాదాస్పదమయ్యింది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీతోపాటు ఇతర పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వాటిని తొలగించడం రాజ్యాంగంపై దాడేనన్నారు.

* చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు భాజపా ఎంపీ హేమమాలిని తెలిపారు.

* మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై లోక్‌స‌భ‌లో బుధ‌వారం జరిగిన చ‌ర్చ సంద‌ర్భంగా టీఎంసీ (TMC) నేత క‌కోలి ఘోష్ ద‌స్తిదార్ బీజేపీపై విరుచుకుప‌డ్డారు. 16 రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారంలో ఉన్న పాల‌క పార్టీకి ఒక్క రాష్ట్రంలోనూ మ‌హిళా సీఎం లేర‌ని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీ కేంద్రంలో తొమ్మిదేండ్ల‌కు పైగా అధికారంలో ఉన్నా ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు తీసుకురావాల‌న్న ఆలోచ‌న రాక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని అన్నారు. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన తర్వాత చివ‌రి ఏడాది ఈ దిశ‌గా ప్ర‌య్న‌తాలు చేస్తోంద‌ని ఆక్షేపించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు తీసుకువ‌చ్చేందుకు ఇంత కాలం ఎందుకు ఆగారు..? 2014లోనే ఎందుకు తీసుకురాలేద‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల ముందే ఎందుకు..? దేశ ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌ద‌లుచుకున్నార‌ని కాషాయ పాల‌కుల‌ను నిల‌దీశారు.

* బీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మి పథకంఇళ్లు లేని నిరుపేదలకు వరంగా మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు.

* కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టిందన్నారు. ఈ పథకాలతో సీఎం కేసీఆర్‌ నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నలా అండగా ఉంటున్నారని ప్రశంసించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, మిషన్‌ భగీరథ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు.

*