కెనడాలోని ఏ నగరానికి వెళ్లాలన్నా విమాన టికెట్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. సాధారణ ధర కన్నా వంద శాతానికిపైగా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం భారత్-కెనడా మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం విమాన టికెట్లపైనా పడుతోంది. సాధారణంగా సెప్టెంబరు చివరి వారంలో కెనడాలోని వివిధ నగరాల్లో విద్యా సంస్థలు ప్రారంభమవుతాయి. మొదటి వారంలోనే విద్యార్థులు అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి దుబాయి మీదుగా కెనడాకు వెళ్లేందుకు ఒకవైపు టికెట్ ధర రూ.55 వేల నుంచి 65 వేల మధ్య ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఆ ధర రూ.లక్ష నుంచి రూ. 1.10 లక్షల వరకు పలుకుతుంది. సెప్టెంబరు రెండో వారం నుంచి టికెట్ ధరలు దాదాపుగా సాధారణ పరిస్థితికి వస్తాయి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్లు ‘ఈనాడు’తో చెప్పారు. ప్రస్తుతం ఒకవైపు టికెట్ ధర రూ.1.35 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు పలుకుతోంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతి విద్యా సీజన్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యను చదివేందుకు వెళుతుంటారు. ఆ దేశంలోని టొరంటో, మాంట్రియల్, ఒట్టావా నగరాలకు విద్యార్థులు ఎక్కువగా వెళతారు. వాణిజ్యం పరంగా రెండు దేశాల మధ్య రాకపోకలు భారీగానే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మాస్యూటికల్, మిషనరీ, ముత్యాలు, ఆభరణాల వ్యాపారులు కెనడాకు రాకపోకలు సాగిస్తుంటారు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని, తర్వాత పరిస్థితి మామూలైపోతుందని, ఈ సారి ధరలు భారీగా పెరుగుతున్నాయని ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో టికెట్లకు డిమాండ్ పెరగడంతోనే ఇలా జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు.