మా చిన్నపుడు మేము కుటుంబం అందరం కలిసి నేల మీదనే కూర్చుని ఎంతో సరదాగా కబురులు చెప్పుకుంటూ భోజనం చేసే వాళ్లం. అంతే కాదు మా నాన్నగారు పళ్లెం వడిలో పెట్టుకుంటే ఊరుకునే వారు కారు. కానీ ఈ రోజుల్లో కుటుంబం కలిసి భోజనం చేయటం ఏ అరుదు అందులోను నేల మీద కూర్చుని తినటం చాలా అరుదు. నేల మీద కూర్చుని తినటం వల్లన ఎన్ని ఉపయోగాలో చూడండి..
నేలమీద కూర్చొని తినడం చాలా సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. పొట్టపై ఒత్తిడి కూడా పడకుండా ఉంటుంది. ఇలా రోజూ కింద కూర్చుని తినడం అలవాటు చేసుకోవడం వల్ల కండరాల్లో కదలిక పెరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
కింద కూర్చుని నేలపై ప్లేట్ పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం, నమిలి మింగడానికి వెనక్కి రావడం.. ఇలా వెంటవెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలకపాత్ర పోషిస్తాయి. తద్వారా శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది.
మంచి శరీరాకృతికి..
నేలమీద కాళ్లు ముడుచుకొని (బాసింపట్టు వేసుకుని) కూర్చొని తినడం వల్ల వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ఈ ప్రక్రియ వల్ల చక్కటి శరీరాకృతినీ సొంతం చేసుకోవచ్చట!
బరువు తగ్గచ్చు..
నేలమీద కూర్చొని భోంచేయడం వల్ల బరువు కూడా తగ్గచ్చు. కొంతమంది డైనింగ్ టేబుల్ పైన కూర్చుని ఎంత తిన్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఫలితంగా బరువు కూడా పెరుగుతారు. ఇలా టేబుల్ పైన కూర్చున్నప్పుడు ఎక్కువగా తినేయడానికి ఓ కారణం ఉందంటున్నారు నిపుణులు. అదేంటంటే.. మనకు సరిపోయేంత తిన్నామా? లేదా? అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్‌ను అందించే ఒక నాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్‌పై కూర్చొని తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పనిచేస్తుందట! కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం.. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బంధాలు పటిష్టం..
ఒకసారి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చొని తినండి.. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అలా కుటుంబ సభ్యులందరితో కలిసి మాట్లాడుకుంటూ తింటుంటే ఆ మజాయే వేరు! దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు కూడా పటిష్టమవుతాయి.
అయితే నడుమునొప్పి, కీళ్ల నొప్పులు ఉన్న వారు మాత్రం కింద కూర్చొని అవస్థలు పడకుండా.. వైద్యుని సలహా మేరకు తమకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలాగే కూర్చొని తినడం మంచిది.