* తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) రెండ్రోజుల సీఐడీ కస్టడీ, రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆన్లైన్ ద్వారా విచారణ చేపట్టారు. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు కోరగా.. అక్టోబరు 5వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ ముగిసిన తరువాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచే వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. ‘‘విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? ఏమైనా అసౌకర్యం కలిగిందా? వైద్య పరీక్షలు చేయించారా? అని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. చంద్రబాబును ప్రశ్నించారు. విచారణలో అధికారులు ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు జడ్జికి చెప్పారు. విచారణ అనంతరం చంద్రబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
* చంద్రబాబు (Chandrababu)ను అరెస్టు చేయడం బాధ కలిగించిందని జనసేన (Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారని ఆయన తెలిపారు. తెదేపా-జనసేన పొత్తును జనసేన సైనికులు స్వాగతిస్తున్నారని, ఎక్కడా అసంతృప్తి లేదన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారో త్వరలోనే పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు.
* చంద్రబాబు (Chandrababu) అరెస్టును ఖండిస్తూ ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ చేపట్టడంతో పోలీసులు ఎక్కడికక్కడే పికెట్లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరానికి చేరుకునే మార్గాల్లో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు చంద్రబాబు కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రాజమండ్రి వెళ్తున్న తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబునూ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ నల్లజర్ల టోల్ గేట్ వద్ద వాహనాన్ని నిలిపివేశారు. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారంటూ… పోలీసుల తీరుపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు.
* తెదేపా అధినేత చంద్రబాబుకు మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నానని ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు కార్లలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని రాజమహేంద్రవరం చేరుకున్న వారంతా నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ‘‘ చంద్రబాబు అరెస్టు అక్రమం. ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చాలా బాధకలిగిస్తోంది. హైదరాబాద్‌లో ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేశారు. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు అరెస్టు కక్షపూరిత చర్య. ఆయన అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నాం’’ అని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
* ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ సమాచారం అమెరికా నుంచే కెనడా(Canada)కు అందినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. ఆ తర్వాత కెనడా ఈ ఇంటెలిజెన్స్‌కు అదనపు సమాచారం సమకూర్చుకొన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి చొరబడి సేకరించిన సమాచారం కచ్చితమైన ఆధారంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలోనే భారత్ ఈ దర్యాప్తునకు సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పిలుపునిచ్చారని సదరు పత్రిక వెల్లడించింది.
* హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడాలోని ఖలిస్థానీలను అమెరికా(USA)లోని ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) స్వయంగా అప్రమత్తం చేసింది. ఏ క్షణమైన మృత్యువు ముంచుకొస్తుందని వారిని హెచ్చరించినట్లు ఇన్వెస్టిగేటివ్ పత్రిక ఇంటర్సెప్ట్ ఈ మేరకు కథనం ప్రచురించింది. ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత నిజ్జర్‌ను కెనడాలోని సర్రేలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన అనంతరం తనతో సహా కాలిఫోర్నియాలోని ఇద్దరు సిక్కు నేతలకు ఎఫ్‌బీఐ నుంచి ఫోన్లు వచ్చాయని అమెరికన్ సిక్కు కాకసస్ కమిటీ సమన్వయ కర్త ప్రీత్‌పాల్ ఇంటర్‌సెప్ట్‌కు వెల్లడించారు. కొందరి వద్దకు అధికారులు నేరుగా వెళ్లి కలిసినట్లు సమాచారం.
* పలువురు అమెరికా పారిశ్రామిక వేత్తలు ఉక్రెయిన్‌లో (Ukraine) పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన వెంటనే అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభిస్తామని అన్నారు. వారం రోజులపాటు జెలెన్ స్కీ అమెరికా (America), కెనడాలో (Canada) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. తన పర్యటన వివరాలపై జెలెన్ స్కీ ఆదివారం మాట్లాడుతూ మెకేల్ బ్లూమ్‌బర్గ్, లారీ ఫింక్, బిల్ అక్మాన్ వంటి వ్యాపారవేత్తలు సైతం ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రష్యాతో యుద్ధం ముగిసిన వెంటనే అది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
* రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) మంచి ఫలితాలు సాధిస్తుందని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ విజయం ఖాయమని, రాజస్థాన్‌లో చాలా దగ్గరి పోటీ ఉందని, అయినప్పటికీ గెలుపొందుతామన్నారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ మేరకు మాట్లాడారు. తెలంగాణలో భాజపా (BJP) క్షీణించిందని.. అక్కడ ఆ పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానించారు. మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
* తెలంగాణలో 9 ఏళ్లుగా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 1న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పారు
* ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో (Char Dham yatra) ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు మరణించారు. అనారోగ్య సమస్యలు, బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ గణాంకాల ప్రకారం కేదార్నాథ్ ధామ్ మార్గంలో అత్యధికంగా 96 మరణాలు నమోదయ్యాయి. యమునోత్రి ధామ్‌లో 34, బద్రీనాథ్ ధామ్‌లో 33, గంగోత్రి ధామ్‌లో 29, హేమకుండ్ సాహిబ్‌లో ఏడుగురు, గౌముఖ్ ట్రెక్‌లో ఒకరు మరణించారు. ఆరోగ్య సమస్యలతో పాటు బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చార్ధామ్ యాత్రకు సుమారు 42 లక్షల మంది, ప్రధానంగా కేదార్నాథ్ ధామ్‌కు 13.4 లక్షల మంది యాత్రికులు పొటెత్తినట్లు వెల్లడించారు.