* అసెంబ్లీలో మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదింటి ఆడబిడ్డకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారు. ప్రతీ ఆడబిడ్డ కష్టాలు సీఎం జగన్ తీర్చుతున్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం చేసిన కృషిని చూసి మహిళలందరూ జయహో జగన్ అంటున్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో మహిళల కోసం చేయలేనిది సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు. సీఎం జగన్ మనసున్న నాయకుడన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొన్న తొడగొట్టారు…ఇవాళ తోక ముడిచారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. సీఎం జగన్ సంక్షేమ పథకాలపై బాలకృష్ణ చర్చకు రాగలరా? అని ప్రశ్నించారు.
* అన్నాడీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. బీజేపీతో పొత్తుకు బ్రేకప్ చెప్పేసింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యే, జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేపట్టారు. బీజేపీ, ఎన్డీఏతో అన్ని సంబంధాలను తెంపుకుంటున్నట్లు అన్నాడీఎంకే నేత ప్రకటించారు.
* గతంలో కల్యాణ లక్ష్మి పథకం లేదు. ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే విధంగా పరిస్థితి ఉండేది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోసం రూ.1,01,116 సాయంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందనిదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్వాడ మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
* అందరి సంక్షేమమే ధ్యేయంగా ఆలోచించి పనిచేస్తున్న పార్టీగా బీఆర్‌ఎస్ చరిత్రలో నిలిచిపోతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సైనికుల లాంటి కార్యకర్తల కోసం బీమా చేసి, ఆ కుటుంబాలను ఆదుకుంటున్న పార్టీ కూడా బీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు.
* మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవన్‌కులే కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ బరితెగింపును బట్టబయలు చేశాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర సర్కార్‌పై, బీజేపీపై ఎలాంటి ప్రతికూల వార్తలు రాకుండా జర్నలిస్టులను మచ్చిక చేసుకోవాలని ఆయన కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. అహ్మద్‌నగర్‌లో బ్లాక్ కమిటీ కార్యకర్తలతో చంద్రశేఖర్ భవన్‌కులే మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసి రాద్ధాంతం సృష్టించే జర్నలిస్టుల జాబితాను తయారుచేసి వారి కదలికలను, రిపోర్ట్స్‌ను పసిగట్టాలని కోరారు. జర్నలిస్టుల నుంచి కేవలం పాజిటివ్ వార్తలే వచ్చేవిధంగా చూసుకోవాలని పార్టీ కార్యకర్తలకు ఆయన హితబోధ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది.
* యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల 2వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు.
* నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. నామినేటెడ్ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిరస్కరించారు. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను మంత్రి మండలి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తమిళిసై అన్నారు.
* ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (ఛాఘ్) తప్పుబట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా వీటి ఏర్పాటు సరికాదని పేర్కొంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన నివేదికల్ని కాగ్ సమర్పించింది. వార్డు కమిటీలు లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తన ఆడిట్ నివేదికలో వెల్లడించింది.
* ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకు పరిమితమైంది.
* నగరంలోని మూసారాంబాగ్ వద్ద రూ.152 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మూసీ, ఈసా (ఉప నది)లపై రూ.545 కోట్లతో 14 వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివా స్‌యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
* నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే విధించింది. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర నోటరీ భూముల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 84 అమలు నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 3వేల గజాల్లోపు నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం జులై 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో 125 గజాల్లోపు నోటరీ స్థలాలలకు ఉచితంగా… అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు స్టాంపు డ్యూటీతో క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది