* గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. సంజీవయ్య పార్కు వద్ద గణపతిని తీసుకెళ్తున్న వాహనం కింద ప్రమాదవశాత్తు పడి ఓ బాలుడు చనిపోయాడు. బాలుడిని కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణీత్‌కుమార్‌గా గుర్తించారు. మరో ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో వాహనం కిందపడి చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం నగరంలోని సంతోష్‌నగర్ ప్రెస్‌కాలనీలో నివాసముంటోంది. గణేశ్ నిమజ్జనం కోసం ద్విచక్ర వాహనంపై కుటుంబంతో కలిసి ఆయన బయల్దేరారు. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో వారంతా కింద పడ్డారు. ఈ క్రమంలో నాలుగేళ్ల బాలుడు ఆయుష్ పైనుంచి మరో వాహనం వెళ్లింది. తీవ్ర గాయాల పాలైన బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
* ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో మొయిన్‌పురి(Mainpuri)లో జరిగిన అమానవీయ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంజక్షన్ వికటించడంతో ఓ బాలిక మృతి చెందిందని, తర్వాత ఆ బాలికను చడీచప్పుడు చేయకుండా ఆసుపత్రి బయట ఉన్న బైక్‌పై పడేసి, సిబ్బంది పారిపోయారని ఆ వార్తల సారాంశం. దీనిపై ప్రభుత్వం స్పందించింది. సంబంధిత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన 17 ఏళ్ల బాధితురాలికి జ్వరం రావడంతో మంగళవారం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిందని ఆమె బంధువు ఒకరు వెల్లడించారు. బుధవారం కూడా ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందన్నారు. డాక్టర్ ఒక ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయిందని ఆరోపించారు. అనారోగ్యం ఎక్కువైందని, తాము ఏమీ చేయలేమని, వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెప్పారన్నారు. కానీ, వారు తమకు ఆ విషయం చెప్పే సమయానికే.. తమ బిడ్డ మృతి చెందిందని వాపోయారు.
* దేశ రాజధాని నగరం దిల్లీలో ఇటీవల సంచలనం సృష్టించిన సుమారు ₹25 కోట్ల విలువైన నగల దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బంగారం దుకాణంలోకి ప్రవేశించి విలువైన నగల్ని చోరీ చేసిన వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు లోకేశ్ శ్రీవాస్తవ, శివ చంద్రవంశీతో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు పేర్కొన్నారు. నిందితుల నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గతంలో ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు.
* మహబూబాబాద్ జిల్లాలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన బాలుడి హత్యోదంతం కేసులో న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. మహబూబాబాద్‌లోని కృష్ణకాలనీకి చెందిన కుసుమ వసంత, రంజిత్ రెడ్డిల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి(9)..2020 అక్టోబర్ 18న అపహరణకు గురయ్యాడు. దీక్షిత్ రెడ్డిని సాగర్ అనే యువకుడు కిడ్నాప్ చేసి.. గుట్టల్లోకి తీసుకెళ్లి టీషర్టు మెడకు బిగించి హత్య చేశాడు. డబ్బు కోసమే బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిందితుడికి మరణ శిక్ష విధించింది.
* పెళ్లి కాకుండానే కుమార్తె గర్భం దాల్చిందని కుటుంబ సభ్యులు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ హపుర్ (Hapur) జిల్లాకు చెందిన 23 ఏళ్ల ఓ యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఇద్దరి మధ్య చనువుతో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ కుమార్తె పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న విషయం బంధువులకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ యువతి తల్లి, సోదరుడు ఆమెను ఇంటికి సమీపంలోని అడవిలోకి గురువారం తీసుకువెళ్లారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. శరీరం దాదాపు 70 శాతానికి పైగా కాలడంతో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా ఈ దారుణానికి పాల్పడిన బాధితురాలి తల్లి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని, ఘటనపై మరింత దర్యాప్తు జరగాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
* వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో బాంబు కలకలం రేగింది. ఓ రియల్ ఎస్టేట్ స్థలంలో శుక్రవారం ఉదయం స్థానికులు దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, పట్టణ సీఐ సదా శివయ్య ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. దొరికిన బాంబు గురించి స్థానికులతో ఆరా తీస్తున్నారు. 2019 జులై 23న అదే స్థలంలో 54 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. మళ్లీ అదే స్థలంలో ఇప్పుడు బాంబు దొరకడంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.