* చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు వేదికగా శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని భాజపా పూరించింది. ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు.
* తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ (PM Modi) వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘‘కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. పసుపుపై పరిశోధనలూ పెరిగాయి. తెలంగాణలో పసుపు రైతుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని వెల్లడించారు.
* 60ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్, ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ వస్తోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో ₹313 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మందమర్రిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
* యూసుఫ్‌గూడ డివిజన్ లక్ష్మీనరసింహనగర్‌లో స్థానిక జాంగీర్‌ఖాన్ మసీదు సమీపంలోని ఓ వీధిలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. సెప్టెంబరు 28న రాత్రి డీసీఎంలో నిమజ్జనానికి తరలిస్తుండగా విగ్రహం తీగలకు తగిలి కిందపడిపోయింది. భయాందోళనలకు గురైన వాహనంలోని యువతుల అరుపులకు అదే వీధిలో ఉండే ముస్లిం యువకులు ఫయీం, జాఫర్, వసీం, ముబషీర్, ముదస్సీర్‌తదితరులు వెంటనే స్పందించి విగ్రహాన్ని డీసీఎంలోకి ఎక్కించారు.
* అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం పోరాడే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని సీపీఐ ఏపీ కార్యదర్శి కే రామకృష్ణ (CPI Ramakrishna) అన్నారు. సీపీఐపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కమ్యూనిస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి జీవీఎల్ చేసిన కృషి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో జీవీఎల్ చెప్పాలన్నారు.
* జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో డ్రగ్స్ ముఠాగుట్టు రట్టయింది. రాంబన్ జిల్లాలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా కొకైన్‌ను సీజ్ చేశారు. మొత్తం 30 కిలోల కొకైన్ పట్టుపడగా.. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారంలో ఇద్దరు పంజాబీలను అరెస్టు చేశారు.
* భారతదేశం 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బలమైన సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. రక్షణశాఖ ఆర్థిక వనరులను త్రివిధ దళాలు సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ (DAD) 276వ వార్షిక దినోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు.
* ఎన్సీపీని (NCP) ఎవరు స్థాపించారనే విషయం ప్రజలందరికీ తెలుసని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) వ్యాఖ్యానించారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిన నేపథ్యంలో ఆయనకు ఎన్నికల కమిషన్ నుంచి సమన్లు అందాయి. దాంతో పవార్ అక్టోబర్ 6న దిల్లీలో (Delhi) ఈసీ ఎదుట హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన పుణె జిల్లాలోని జున్నార్‌లో మీడియాతో మాట్లాడారు.
* రాంచీ (Ranchi) నుంచి దిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానంలో (IndiGo) శనివారం ఈ ఘటన జరిగింది. ఆ చిన్నారికి పుట్టుకతోనే గుండె సంబంధమైన సమస్యలు ఉన్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికి ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడుతోంది. విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది.. పరిస్థితిని తెలియజెప్పి.. ఎవరైనా వైద్యులు ఉంటే సాయం చేయాలని కోరారు. అందులో ప్రయాణిస్తున్న ఐఏఎస్ అధికారి, వైద్యుడు డా.నితిన్ కులకర్ణి అప్రమత్తమై వెంటనే చిన్నారి దగ్గరకు చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో వైద్యుడు మొజామిల్ ఫిరోజ్ అతడికి తోడయ్యారు. ఇద్దరూ కలిసి అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో చిన్నారికి కృత్రిమ శ్వాస అందించారు. ఈ లోగా విమాన సిబ్బంది దిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికి అక్కడి అధికారులు అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. చికిత్స కోసం చిన్నారిని దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.
* ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. ఆదివారం ఉదయం.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన కసిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని భావిస్తున్నానని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
* తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సత్తుపల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయలు బిగ్ షాకిచ్చారు. దీంతో, అక్కడి రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. సత్తుపల్లిలో బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తుమ్మల వర్గీయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి 500 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు.
* బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని కలవబోవడంలేదని స్పష్టం చేశారు. వారితోనే కాదు మారె ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, ఇతర కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ యూపీలోనూ ఉత్తరాఖండ్‌లోనూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మన సొంత బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.
* తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి చైతన్యవంతమైన గడ్డ అన్నారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు కాంగ్రెస్ ప్రజలు నమ్మరన్నారు. 11 సార్లు 55 ఏళ్ల పాటు అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నిలదీశారు. ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన కాంగ్రెస్ కు రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీబందు, మైనార్టీ బంధు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను అమలు చేసిందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ పార్టీ అధికారంలోకి రాదని.. తాను గెలిచాక బీఆర్‌ఎస్‌లో చేరుతానని అసత్యపు ప్రచారం చేసుకుంటున్నాడని.. పెద్దపల్లి నియోజకవర్గ ప్రతినిధి మనోహర్‌రెడ్డేనని స్పష్టం చేశారు.
* చంద్రబాబు ఆధ్వర్యంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం జరిగిందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాబును సమర్థిస్తున్న సోమిరెడ్డికి సిగ్గులేదని దుయ్యబట్టారు. ఇన్వాయిస్ లేకుండా నగదును కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. బాబు చేసిన అవినీతి వెలుగులోకి వచ్చింది గోరంతే. అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే లోకేష్ ఢిల్లీకి వెళ్లారు’’ అంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి అభాసు పాలయ్యారు. విశ్వవిద్యాలయానికి, ఈ పథకానికి సంబంధం లేదని చెప్పడంతో ఆదిశంకరా కళాశాలకు వెళ్లారు. అక్కడ పది కోట్లు పెట్టామని చెప్పారు. పది కోట్లు పెట్టినట్లు రుజువు చేస్తే ఏమి చేసేందుకైనా సిద్ధం. వాస్తవంగా రూ.80 కోట్లు ఇవ్వాలి. ఇందులో రూ.70 కోట్లు తినేశారు. కళాశాల యజమాన్యాన్ని అడిగితే వీటి విలువ రెండు కోట్లు కూడా కావని స్పష్టం చేశారు. పరికరాలకు సంబంధించి ఇన్వాయిస్ ఉండాలి అందులో ధర కూడా పొందుపరచాలి. రూ.10 కోట్లు కూడా ఇచ్చినట్లు రుజువు చేస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా’’ అంటూ మంత్రి సవాల్ విసిరారు.
* ప్రజల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, నారాయణ కలిసి వేలకోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ‘‘పేదల భూములు కొట్టేసిన నారాయణ సత్య హరిశ్చంద్రుడా?. త్వరలో అరెస్టవుతానని నారాయణకి భయం పట్టుకుంది. రూ.800 కోట్ల పేదల అసైన్డ్ భూములు నారాయణ దోచేశారు. త్వరలో నారాయణ అక్రమాలన్నీ బయటపడతాయి. విచారణకు సహకరించకూడదని బాబు, నారాయణ మాట్లాడుకున్నారు. వారి చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు’’ అని అనిల్ పేర్కొన్నారు.
* చంద్రబాబు నంద్యాల నుంచి పోటీ చేయాలని కర్నూలు, నంద్యాల జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే ఆహ్వానం పలికినట్లు సమాచారం. నంద్యాలలో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై పోటీ ఉంది. మాజీ మంత్రి అఖిలప్రియ తమ్ముడు జగత్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ లేదా ఆయన కొడుకు ఫిరోజ్, మరో నేత ఏవి సుబ్బారెడ్డి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు.పైగా చంద్రబాబు నంద్యాల నుంచి పోటీ చేస్తే కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగనుంది అనేది వేచి చూడాల్సిందే.