Politics

పాలమూరులో ప్రధాని మోడీ ప్రసంగం విశేషాలు

పాలమూరులో ప్రధాని మోడీ ప్రసంగం విశేషాలు

‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. మహబూబ్‌నగర్‌లో తొలుత అధికారిక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓపెన్‌టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదికైన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి మహిళలు నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు.

అనంతరం పాలమూరు ప్రజలకు నమస్కారాలు అంటూ ప్రధాని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందని భాజపా శ్రేణులకు భరోసా కల్పించారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఇవాళ శుభదినం. రాష్ట్రంలో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాం. కేంద్రం చేపట్టే ప్రాజెక్టులతో ప్రజలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ భాజపాకు అండగా నిలుస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాను బలపర్చారు. ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే.. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటున్నదని స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని మోదీ అన్నారు.

భారాస సర్కారు మజ్లీస్‌ చేతిలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వాన్ని నడిపే కారు స్టీరింగ్‌ ఎవరిచేతుల్లో ఉందో ప్రజలకు తెలుసన్నారు. అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన ఆ రెండు కుటుంబాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. సామాన్య ప్రజల గురించి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. ఆ కంపెనీలో డైరెక్టర్‌, మేనేజర్‌, సెక్రటరీ అన్ని పదవులు ఆ కుటుంబ సభ్యులవేనని ఎద్దేవా చేశారు. కొన్ని అవసరాల కోసం కొందరిని సహాయకులుగా నియమించుకున్నారని విమర్శించారు. భాజపాపై ప్రజల ప్రేమ చూసి కాంగ్రెస్, భారాసకు నిద్రపట్టదన్నారు.

రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ పేరుతో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘దేశంలో పండగల సీజన్‌ మొదలైంది. తెలంగాణలో ఇవాళ రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. కేంద్రం చేపట్టిన ఈ పనులతో ఎంతో మందికి ఉపాధికి కలుగుతుంది. తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు తెచ్చుకున్నాం. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణ అనుసంధానం పెరిగింది. దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్‌ పార్క్‌తో వరంగల్‌, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుంది’’ అని మోదీ వెల్లడించారు.

‘‘రాణి రుద్రమదేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ మనది. మహిళల గొంతు చట్టసభల్లో మరింత గట్టిగా వినిపించే రోజులు వస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల చట్టంతో చట్టసభల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుంది. మహిళలు ఇల్లు కట్టుకుంటే కేంద్రం పీఏంఏవై నిధులు ఇస్తోంది. భాజపా ప్రభుత్వం 9 ఏళ్లలోనే తెలంగాణలో 2500 కి.మీ హైవేలు నిర్మించింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా ముద్ర బ్యాంకు ద్వారా వీధివ్యాపారులకు రుణాలు ఇస్తున్నాం. 2014కు పూర్వం ధాన్యం కొనుగోళ్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3,400 కోట్లు మాత్రమే ఇచ్చింది. భాజపా ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోళ్లకు రూ.27 వేల కోట్లు ఇస్తోంది. తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి లబ్ధిపొందిన సర్కారు ఆ తర్వాత రైతులను విస్మరించింది. పీఎం కిసాన్‌ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించి ఎరువుల కొరత తీర్చాం’’ అని మోదీ వివరించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజన్నారు. కోట్లాది మంది పూజించే వనదేవతలు సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుండటం సంతోషకరమన్నారు. జాతీయ పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పసుపు రైతులు పసుపుబోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని, దశాబ్దాల నాటి కలను మోదీ సాకారం చేశారన్నారు.