* టీ దుకాణంలో నగదు దొంగతనం చేశాడని ఆరోపిస్తూ ఓ మైనర్ బాలుడిని నిర్వాహకులు చిత్ర హింసలకు గురి చేశారు. అతడి దుస్తులు విప్పేసి నగ్నంగా ఆ బాలుడిని స్తంభానికి కట్టేశారు. అంతటితో ఆగకుండా కర్రలు, చెప్పులతో ఇష్టమొచ్చినట్లుగా చావబాదారు. ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల వారెవరూ అడ్డుకోలేదు సరికదా, ఆ వికృత దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధిస్తూ మౌనంగా నిలబడిపోయారు. నొప్పిని భరించలేక ఆ 12 ఏళ్ల బాలుడు విలవిల్లాడుతున్నా సరే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో సోమవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని రక్షించారు. వైద్య చికిత్స అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా ఎస్సీ సర్వేశ్ కుమార్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో తండ్రి, కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
* తన సతీమణి, దివంగత శ్రీదేవి (Sridevi)ని ఉద్దేశించి నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) కీలక వ్యాఖ్యలు చేశారు. “స్క్రీన్‌పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి తరచూ డైట్ చేస్తుండేది. తను స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుందనే విషయం పెళ్లయ్యాకే నాకూ తెలిసింది. సాల్ట్ లేకుండా భోజనం తీసుకునేది. దానివల్ల ఆమె నీరసించి పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఆమెకు లో బీపీ సమస్యలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండమని వైద్యులు ఎంతగానో చెప్పారు. కానీ ఆమె సీరియస్‌గా తీసుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె మరణానంతరం దుబాయ్ పోలీసులు నన్ను 24 గంటలపాటు విచారించారు. లై డిటెక్టర్ పరీక్షలూ చేశారు. భారతీయ మీడియా నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగానే నన్ను అన్ని విధాలుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని చివరకు వారు నిర్ధారించారు.” అని ఆయన తెలిపారు. 2018లో బంధువుల వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న కన్నుమూశారు.
* తెలుగు రాష్ట్రాల్లో 62 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాల కేసులో ఈ సోదాలు చేశారు. సోదాలకు సంబంధించిన వివరాలతో ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. ముచింగిపట్టు మావోయిస్టు కేసులో భాగంగా తనిఖీలు చేసినట్లు పేర్కొంది. ఒకరిని అరెస్టు చేయగా.. ఆయుధాలు, నగదు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
* హైదరాబాద్ రామంతాపూర్ పరిధిలోని వివేక్ నగర్లో దారుణం జరిగింది. హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందారు. శనివారం తలపై పలకతో కొట్టడంతో హేమంత్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇవాళ చికిత్స పొందుతూ హేమంత్ మృతి చెందారు. దీంతో రామంతాపూర్‌లోని పాఠశాల వద్ద విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
* పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే ఓ పెట్టెలో విగత జీవులుగా పడి ఉన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముద్దు ముద్దు మాటలతో సందడి చేసే చిన్నారులు కాంచన (4), శక్తి (7), అమృత (9) ఇక తమ మధ్య లేరన్న వార్తతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలంధర జిల్లాలో పనికోసం వలస వచ్చిన దంపతులకు ఐదుగురు సంతానం. ఆదివారం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ముగ్గురు కుమార్తెలు కనబడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ భార్యాభర్తలు మక్సుదాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
* తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ నోటీసూ ఇవ్వకుండా రాత్రి నుంచి పోలీసులు తమను నిర్బంధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అనకాపల్లి (Anakapalle) జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక పెద్దఎత్తున పోలీసులు మోహరించడం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే.
* దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మెహ్రౌలీ ఏరియాలో తాను అద్దెకుంటున్న అపార్టుమెంట్‌లోని ప్లాట్‌లో ఆమె ఆదివారం రాత్రి ఈ అఘాయిత్యం చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మహిళా కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సదరు మహిళా కానిస్టేబుల్ స్వస్థలం మిజోరాం రాష్ట్రమని, ఢిల్లీలోని కిషన్ గఢ్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.