Business

కనిష్ఠస్థాయికి బంగారం ధరలు-వాణిజ్యం

కనిష్ఠస్థాయికి బంగారం ధరలు-వాణిజ్యం

* భారత్‌లో క్రోమ్‌బుక్‌ (Chromebook)ల తయారీ ప్రారంభమైంది. గూగుల్‌తో కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. చెన్నై సమీపంలోని ఫ్లెక్‌ ఫెసిలిటీ ప్లాంటు వద్ద ఈ క్రోమ్‌బుక్‌ (Chromebook)ల తయారీ నేటి నుంచి మొదలైనట్లు హెచ్‌పీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ప్లాంటులో 2020 ఆగస్టు నుంచి పలు రకాల ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను హెచ్‌పీ తయారు చేస్తోంది. భారతదేశంలో Chromebookలను తయారు చేయడానికి మేం HPతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. భారత్‌లో Chromebookలను తయారు చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా భారతీయ విద్యార్థులకు చౌకైన, సురక్షితమైన కంప్యూటింగ్‌కు అవకాశాలు మెరుగుపడతాయి అని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సోమవారం ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. కొత్త క్రోమ్‌బుక్‌ (Chromebook)లు రూ.15,990 ప్రారంభ ధర వద్ద ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని హెచ్‌పీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

* భారతీయ యూజర్లకు వాట్సాప్‌ (Whatsapp) మరోసారి షాకిచ్చింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను ఆధారంగా లక్షలాది ఖాతాలపై నిషేధం విధించింది. నూతన ఐటీ నిబంధనలను అనుసరించి కేవలం ఆగస్టు నెలలోనే 74.2 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ తాజాగా వెల్లడించింది. జులై నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఎక్కువ. ఆగస్టులో నిషేధం విధించిన మొత్తం అకౌంట్లలో 35 లక్షలకు పైగా ఖాతాలపై ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. వీటిపై వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, కానీ, ఆయా ఖాతాల డేటాను విశ్లేషించి ముందుగానే నిషేధించినట్లు పేర్కొంది. మరోవైపు సెప్టెంబరు నెలలో 72.28 లక్షల ఖాతాలను నిషేధించగా.. అందులో 3.1 లక్షల అకౌంట్లను ముందస్తు చర్యల్లో భాగంగానే నిలిపివేశారు.

* బ్రీత్అన‌లైజర్ టెస్ట్ సంద‌ర్భంగా పైల‌ట్లు, విమాన సిబ్బంది పెర్ఫ్యూమ్ వాడ‌టంపై నిషేధం విధిస్తూ భార‌త పౌర విమాన‌యాన డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ (DGCA) ముసాయిదాను తీసుకువ‌చ్చింది. పెర్ఫ్యూమ్స్‌లో ఆల్క‌హాల్ కంటెంట్ ఉండ‌టంతో అవి బ్రీత్అన‌లైజ‌ర్ టెస్ట్‌పై ప్ర‌భావం చూప‌డంతో డీజీసీఏ ఈ ప్ర‌తిపాద‌న‌ను ముందుకుతెచ్చింది. తాజా ముసాయిదా ప్ర‌కారం విమాన సిబ్బంది ఎవ‌రూ ఎలాంటి మెడిసిన్‌, ఫార్ములేష‌న్‌, మౌత్‌వాష్‌, టూత్‌జెల్‌, పెర్ఫ్యూమ్ వంటి ఆల్క‌హాల్ కంటెంట్ ఉన్న వాటిని వాడ‌రాద‌ని, ఇది పాజిటివ్ బ్రీత్అన‌లైజ‌ర్ రిజ‌ల్ట్‌కు దారితీస్తుంద‌ని డీజీసీఏ ముసాయిదా పేర్కొంది.

* పండుగ సీజన్లో అధిక ధర పలికే బంగారం ఈ దఫా అంతర్జాతీయ పరిణామాల కారణంగా రోజురోజుకూ తగ్గిపోతున్నది. హైదరాబాద్‌ మార్కెట్లో శనివారం తులం ధర రూ. 58,200 స్థాయికి దిగివచ్చింది. అలాగే దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో శుక్రవారం గోల్డ్‌ అక్టోబర్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు రూ. 57,096 స్థాయికి, ప్రపంచ మార్కెట్లో స్పాట్‌ బంగారం ఔన్సు ధర 1,848 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల నెలల కనిష్ఠస్థాయి. డాలర్‌ ఇండెక్స్‌ అదే పనిగా పెరుగుతూ 10 నెలల గరిష్ఠస్థాయికి చేరడం, అమెరికాలో అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న భయాలతో ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆక్మే ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుగంధ సచ్‌దేవా వివరించారు. అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ భారత్‌లో సైతం పుత్తడి ధర క్షీణిస్తున్నది.

* బెంగళూరుకు చెందిన ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ డన్జోకు భారీ షాక్‌ తగిలింది. లిక్విడిటీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి కంపెనీకి గుడ్‌బై చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతున్న స్టార్టప్‌ భారీ పునర్నిర్మాణ ప్లాన్‌ ప్రకటించిన తరువాత నలుగురు సహ వ్యవస్థాపకులలో ఒకరైన దల్వీర్ సూరి సంస్థ నుంచి నిష్క్రమించడం చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని డన్జో CEO కబీర్ బిస్వాస్ సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. సూరి కొంత కాలంగా విరామం తీసుకోవాలని భావిస్తున్నారని, సరికొత్తగా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ త్రైమాసికం నుండే వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.