తనతో సహజీవనంలో ఉన్న యువకుడిపై ఓ మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు.. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఓర్చు వెంకటేష్ అనే యువకుడు ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. గుంటూరులోని పలు ప్రాంతాలకు ఆటోలో మంచినీటి డబ్బాలు చేరవేసే క్రమంలో నగర పరిధిలోని రామిరెడ్డితోటలో ఉండే రాధ అనే వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. తెలంగాణ ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఆమెకు భర్త లేడు. ఇక్కడే ఉంటూ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తుంటుంది. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట వెంకటేష్ ఆ మహిళను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి అక్కడే ఉంటున్నారు. ఇది నచ్చని యువకుడి కుటుంబసభ్యులు రాధను ఇంటి నుంచి పంపించేశారు. దీంతో తనను వెంకటేష్, అతని కుటుంబ సభ్యులు కొట్టి గాయపర్చారని ఆమె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. వెంకటేష్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదయింది. తనను బయటకు గెంటేశారని కక్ష పెంచుకున్న రాధ మంగళవారం మరో ముగ్గురు యువకులతో కలిసి ఆటోలో వెళ్లి ఓ ప్రాంతంలో తాగునీటి డబ్బాలు దించుతున్న వెంకటేష్‌పై వెనక నుంచి యాసిడ్ పోసింది. అతడు కేకలు వేయటంతో స్థానికులు బాధితుడిని జీజీహెచ్‌కు తరలించారు. మరోవైపు నిందితురాలు రాధ వచ్చిన ఆటోలోనే పరారైంది. చికిత్స పొందుతున్న తనకు రాధ ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిందని బాధితుడు ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళతో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
యువకుడిపై యాసిడ్ పోసిన ఖమ్మం జిల్లా మహిళ
Related tags :