Business

గృహ రుణాలపై RBI శుభవార్త-వాణిజ్యం

గృహ రుణాలపై RBI శుభవార్త-వాణిజ్యం

* ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆధ్వర్యంలోని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఎక్స్ (గతంలో ట్విటర్‌) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎక్స్‌లో మూడు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బేసిక్‌, స్టాండర్డ్‌, ప్లస్‌ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ ప్లాన్‌లకు పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో ఎక్స్ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఎక్స్ ప్రీమియం (గతంలో ట్విటర్‌ బ్లూ) కోసం యూజర్లు నెలవారీ ఎనిమిది డాలర్లు చెల్లించాలి. త్వరలో దాని స్థానంలో మూడు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్లాన్‌ల ద్వారా గతంలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోని యూజర్లను ఆకర్షించడంతోపాటు.. ఆదాయం పెంచుకోవాలని ఎక్స్ భావిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న మస్క్‌.. త్వరలో స్వల్ప నెలవారీ రుసుముతో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్‌ను తొలగించేందుకు ఇదే సరైన మార్గమని అప్పట్లో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇప్పుడు దాన్నే అమలులోకి తీసుకొస్తున్నారని సమాచారం.

* రూ. 2000 నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రేప‌టితో గ‌డువు ముగుస్తుండ‌టంతో ఆర్బీఐ (RBI) గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ శుక్ర‌వారం కీల‌క‌ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం రూ. 12,000 కోట్ల విలువైన (3.37 శాతం) 2000 నోట్లు చ‌లామ‌ణిలో ఉన్నాయని ఆయ‌న పేర్కొన్నారు. రూ. 2000 నోట్ల‌లో 96 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్య‌వ‌స్ధ‌కు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 3.43 ల‌క్ష‌ల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు బ్యాంకుల‌కు చేరాయ‌ని కేవ‌లం రూ. 12,000 కోట్ల విలువైన నోట్లు మిగిలిఉన్నాయ‌ని శ‌క్తికాంత దాస్ తెలిపారు. 87 శాతం బ్యాంక్ డిపాజిట్లుగా వ‌చ్చాయ‌ని, మిగిలిన‌వి ఇత‌ర నోట్ల‌తో ఎక్స్ఛేంజ్ చేసుకున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రూ. 2000 నోటును ఉప‌సంహ‌రిస్తున్న‌ట్టు ఆర్బీఐ మే 19న వెల్ల‌డించే నాటికి రూ. 3.56 ల‌క్ష‌ల కోట్లు వ్య‌వ‌స్ధ‌లో ఉండగా, ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 3.44 ల‌క్ష‌ల కోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్య‌వ‌స్ధ‌లోకి తిరిగివ‌చ్చాయ‌ని చెప్పారు. ఇక అక్టోబ‌ర్ 8 నుంచి బ్యాంకులు రూ. 2000 నోట్లను ఖాతాల్లో జ‌మ‌చేయ‌డం, లేదా ఇత‌ర బ్యాంక్ నోట్లతో ఎక్స్ఛేంజ్‌ను నిలిపివేస్తాయ‌ని ఆర్బీఐ పేర్కొంది.

* ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ.. ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ను శుక్రవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. సింగిల్ చార్జింగ్‌తో 201 కి.మీ దూరం ప్రయాణించే కెపాసిటీ గల ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటర్ ధర రూ.1.14 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని తెలిపింది. హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ తదితర ఫీచర్లతో వస్తున్న ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటర్.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో లభిస్తుంది.

* టాటా మోటార్స్ న్యూ జనరేషన్ సఫారీ, హారియర్ ఎస్‌యూవీ కార్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కార్ల ప్రేమికులు రూ.25 వేలు చెల్లించి టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్, డీలర్ల వద్ద ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. రెండు కార్లు లెవెల్-2 అడాస్ టెక్నాలజీతో వస్తున్నాయి. లేన్ కీప్ అసిస్ట్, 2-స్పోక్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. హారియర్ ఫేస్ లిఫ్ట్ ఫ్రంట్ కొత్తగా డిజైన్ చేసిన వెర్టికల్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ లైట్ సెటప్, స్లీక్ గ్రిల్లే, ఇండికేటర్లు, బాయ్‌నెట్ పొడవునా ఎల్ఈడీ డీఆర్ఎల్ స్ట్రిప్ ఉంటాయి. న్యూ టాటా సఫారీ కారు న్యూ గ్రిల్లె విత్ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ సెటప్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, న్యూ వెర్టికల్లీ స్టాక్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. టాటా నెక్సాన్, టాటా నెక్సాన్.ఈవీ కార్లలో మాదిరిగా అన్ని మార్పులు చేశారు. మెర్సిడెజ్ బెంజ్ కార్లలో మాదిరిగా ఫుల్ విడ్త్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడల్ కార్లతో టాటా హారియర్, మూడు వరుసల ఎస్‌యూవీ సెగ్మెంట్ లో మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారుతో టాటా సఫారీ పోటీ పడుతుంది.

* సింగ‌పూర్, జ‌పాన్ మాదిరిగా మ‌నం కూడా ప్ర‌పంచాన్ని శాసించే శ‌క్తిగా ఎద‌గాల‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. హ‌నుమ‌కొండ జిల్లాలోని మ‌డికొండ ఐటీ పార్కులో రూ. 40 కోట్ల‌తో అభివృద్ధి చేసిన క్వాడ్రెంట్ ఐటీ కంపెనీని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. టాలెంట్ అనేది ఎవ‌రి సొత్తు కాదు.. ఎందుకంటే వ‌రంగ‌ల్‌లో చ‌దువుకున్నా.. భీమ‌వ‌రంలో చ‌దువుకున్నా.. నెల్లూరులో చ‌దువుకున్నా.. క‌ర్నూల్‌లో చ‌దువుకున్నా.. క‌రీంన‌గ‌ర్‌లో చ‌దువుకున్నా.. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్క‌డ చ‌దువుకున్నా.. అల్టిమేట్‌గా ప్ర‌తి ఒక్క‌రిలో ఒక స‌త్తా, సామ‌ర్థ్యం ఉంటుంది. అది హైద‌రాబాద్‌లో చ‌దువుకున్న‌వాళ్లే గొప్ప‌వాళ్లు.. బెంగ‌ళూరులో చ‌దువుకున్న వాళ్లే గొప్ప‌వాళ్లు.. ఢిల్లీ, బాంబే ఐఐటీల్లో చ‌దువుకున్న‌వాళ్లే గొప్ప‌వాళ్లు.. అని అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ప్ర‌పంచంలో ఎక్క‌డికి పోయినా, అక్క‌డ ఉండే పారిశ్రామిక‌వేత్త‌ల‌ను క‌లిసినా.. వారి గ‌మ్యం, ల‌క్ష్యం ఏంటి..? వాటిని సాధించారా? ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా ఎట్ల అధిగ‌మించి ముందుకు పోయార‌నేది అర్థ‌మ‌వుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. 25 సంవ‌త్స‌రాల క్రితం దేశంలో ఒక డిజిట‌ల్ రెవ‌ల్యూష‌న్‌ ప్రారంభ‌మైంద‌ని ఆయ‌న‌ గుర్తు చేశారు. కొత్త‌గా వ‌చ్చిన ఇంజినీరింగ్ కాలేజీలు, సైన్స్ అండ్ టెక్నాల‌జీలో వ‌చ్చిన ఇన్‌స్టిట్యూట్స్ వ‌ల్ల భార‌త‌దేశంలో ఒక విప్ల‌వం ప్రారంభ‌మైంది. నాడు వైటుకే కంపెనీ వ‌ల్ల ఉపాధి అవ‌కాశాలు ల‌భించాయని మంత్రి తెలిపారు.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) కు చెందిన ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) రెపో రేటుపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని, యథాతథంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. ఆర్బీఐ రెపో రేటులో మార్పులు చేయకుండా ఉంచడం ఇది నాలుగోసారి. రెపో రేటును యథాతథంగా కొనసాగించడంపై MPC ఏకగ్రీవంగా ఓటేసిందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) తెలిపారు. ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం గృహ రుణాల ఈఎంఐలు కడుతున్న వినియోగదారులకు శుభవార్తగా చెప్పవచ్చు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ 6.5 శాతంగా పేర్కొన్నది. సెప్టెంబర్‌ 29 నాటికి దేశ విదేశీ మారక నిల్వలు 586.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని, వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గవచ్చని శక్తికాంత దాస్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగితే పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్‌ అభిప్రాయపడ్డారు.

* తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ప్ర‌పంచ స్థాయి కంపెనీ కేయిన్స్ తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. కేయిన్స్ నిర్ణ‌యాన్ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగ‌తించారు. ఈ మేర‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో అవగాహ‌న ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో సెమీ కండ‌క్ట‌ర్ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయ‌నుంది కేయిన్స్ టెక్నాల‌జీ సంస్థ‌. రూ. 2,800 కోట్ల పెట్టుబ‌డితో ఓసాట్, కాంపౌండ్ సెమీ కండక్ట‌ర్ త‌యారీ కేంద్రం ఏర్పాటు చేయ‌నుంది. ఈ ప‌రిశ్ర‌మ ద్వారా 2 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. సెమీ కండ‌క్ట‌ర్ ప‌రిశ్ర‌మ‌కు ఆతిథ్యం ఇచ్చే ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ గ‌మ్య‌స్థానాల లీగ్‌లో తెలంగాణ చేరినందుకు గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. ఎల‌క్ట్రానిక్స్ రంగంలో ఫ్యాక్స్ కాన్, కార్నింగ్ వంటి ప్ర‌పంచ స్థాయి కంపెనీలు తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.