Politics

తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదు

తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా అధికారంలోకి మరో పార్టీ రావడంతో ఇక్కడి ప్రజలకు ఆశించిన స్థాయిలో మేలు జరగలేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే… రాష్ట్ర పరిస్థితులు ఇలా ఉండేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా చిదంబరం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్‌మెంట్‌ వైస్ ఛైర్మన్‌ అనిల్ థామస్, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తరువాత నిర్వహించిన ర్యాలీలో అధిక సంఖ్యలో యువత పాల్గొనడం తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం లేదన్న ఆయన.. డిగ్రీలు చదివిన 42శాతం యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.