Politics

ఈ నెల 15 నుంచి కాంగ్రెస్‌ బస్సు యాత్ర

ఈ నెల 15 నుంచి కాంగ్రెస్‌ బస్సు యాత్ర

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తును మరింత ముమ్మరం చేసింది. బస్సు యాత్రపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలను సిద్దం చేసుకుంటుంది. ఈ నెల 15 నుండి బస్సు యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బస్సు యాత్రను ఆదిలాబాద్ నుండి ప్రారంభించాలని తలపెట్టారు. అయితే యాత్రను హైద్రాబాద్ లో ముగించే అవకాశం ఉంది. బస్సు యాత్రపై కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికను సిద్దం చేస్తుంది.

ఈ నెల 15, 16 తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రలో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ పాల్గొనే అవకాశం ఉంది.ఈనెల 19, 20, 21 తేదీల్లో బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. బస్సు యాత్ర ముగింపులో ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పాల్గొననున్నారు.

బస్సు యాత్రకు ముందే ఎన్నికల మేనిఫెస్టో ను కూడ విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. అదే సమయంలో ప్రకటించాల్సిన మిగిలిన డిక్లరేషన్లను కూడ కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్ర నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీఎస్, ఆ పార్టీ అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడ అప్పట్లో యాత్రలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగిసిన తర్వాత బస్సు యాత్రను కాంగ్రెస్ అప్పట్లో నిర్వహించింది. కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పే ప్రయత్నంలో భాగంగా బస్సు యాత్రను ఆనాడు కాంగ్రెస్ నిర్వహించింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగక ముందే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక కాంగ్రెస్ కు కూడ గులాంనబీ ఆజాద్ అప్పట్లో ఇంచార్జీగా ఉన్నారు. కర్ణాటక తరహా ఫార్మూలానే ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆజాద్ అనుసరించారు. ఈ ఫార్మూలా అప్పట్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. కర్ణాటక తరహా ఫార్మూలానే కాంగ్రెస్ తెలంగాణలో అనుసరిస్తుంది. తెలంగాణ నేతలు తమ మధ్య ఉన్న అభిప్రాయబేధాలను పక్కన పెట్టాలని ఆ పార్టీ నాయకత్వం సూచించింది.

ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించింది. దీంతో పాటు మేనిఫెస్టోను కూడ ప్రకటించనుంది. వీటన్నింటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బస్సు యాత్ర నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది