సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ - యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరించామని తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఉదాహరణకు చెరువులు మరమ్మతు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు సంభవించిందని వివరించారు.
దళిత బంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగాయని పేర్కొన్నారు. వ్యవస్థీకృత డెలివరీలను ప్రోత్సహించడానికి గానూ శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని చెప్పారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివే మాలవత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిందని ప్రస్తావించారు.
మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పామని, తద్వారా మైనార్టీలు గతంలో ఎప్పుడూ లేనంతగా పాఠశాలలకు వెళ్తున్నారని తెలిపారు. మోడల్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా హాస్టల్ తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలకు రూ.20 వేల వేతనం లభిస్తోందని వివరించారు. హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల గురించి కవిత వివరించారు.
సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పడంలో సందేహమే లేదని, తెలంగాణ ఏర్పాటు కావడమే తన లక్ష్యమని పదువులు ముఖ్యం కాదని కేసీఆర్ అన్నారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో రాశారని గుర్తు చేశారు.
తాను ఎన్నికల ప్రచారం చేస్తున్న క్రమంలో ఒక గ్రామీణ మహిళా తనకు ఒక వెయ్యి రూపాయల ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అయితే, నేరుగా రాజకీయాల్లోకి రాకుండా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించానని తెలిపారు. ఆ సంస్థ ద్వారా మహిళా సాధికాతరకు కార్యకలాపాలు చేపట్టడమే కాకుండా తెలంగాణ సంస్కృత, సంప్రదాయాలను ప్రోత్సహించామని, ముఖ్యంగా బతుకమ్మ పండగను ప్రతీ ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వచ్చామని వివరించారు.
ప్రస్తుతం 65-70 దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరుచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. భూప్రపంచంలో కేవలం మానవ సమూహంలో మాత్రమే మహిళల పట్ల వివక్ష ఉందని, సమాన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గతేడాది నవంబరు నుంచి తాను ఉద్యమాన్ని ఉధృతం చేశానని, ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించానని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించానని వివరించారు.
తమ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని, ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఒత్తిడి తీసుకొచ్చామని వివరించారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలిపారు. మరోవైపు, మహిళా భద్రత గురించి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, షీ టీమ్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు. రాజకీయ పార్టీలు సమాజంలోని అన్ని వర్గాల గురించి ఆలోచించాలని, అందు కోసమే అన్ని వర్గాలకు అవకాశాలు రావాలని ఆకాంక్షించారు.