సింగపూర్ తెలుగు టీవీ వారు నిర్వహించిన తెలుగు తోరణం(Telugu Toranam) వేడుకలు ఘనంగా ముగిశాయి. తెలుగు నీతి పద్యాల పోటీ చివరి వృత్తాన్ని వైభవంగా నిర్వహించారు. సింగపూర్ తెలుగు ప్రముఖులు డా.బి.వీ.ఆర్. చౌదరి, రాజ్యలక్ష్మి దంపతులతో పాటుగా సింగపూర్ నందు ఉన్న తెలుగు సంస్థలు సింగపూర్ తెలుగు సమాజం, తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్, కాకతీయ సాంస్కృతిక పరివారం, శ్రీ సాంస్కృతిక కళా సారధి, పోతన భాగవత ప్రచార సమితి సంస్థల ప్రతినిధులతో పాటుగా తెలుగు సమూహాలు అయిన మనం తెలుగు, అమ్ములు, తెలుగు వనితలు, ప్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యారు.
20 మంది చిన్నారులతో పది వారాల పాటు జరిగిన ఈ పద్యాల పోటీ సింగపూరులోనే మొట్టమొదటి తెలుగు రియాలిటీ షోగా నిలిచి ఇక్కడ ఉన్న చిన్నారులలోని తెలుగు ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకొచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో మొదటి స్థానంలో ఓరుగంటి రాధా శ్రీనిధి, రెండవ స్థానంలో సూదలగుంట ఆరాధ్య, మూడవ స్థానంలోసింగిరెడ్డి శ్రీనిత విజేతలుగా ఎన్నికయ్యారు. విజేతలతో పాటుగా కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులందరికీ తెలుగు ప్రముఖులు జ్ఞాపికలు అందించడంతో పాటుగా దాదాపు 3 వేల డాలర్ల వరకూ నగదు బహుమతులు కూడా అందజేశారు.
అదే విధంగా కార్యక్రమాన్ని, పోటీలో పాల్గొన్న చిన్నారులనూ దీవిస్తూ సాయి కుమార్, తనికెళ్ల భరణి, రాధిక, భువన చంద్ర వంటి సినీ ప్రముఖులు పంపిన వీడియో సందేశాలను కూడా వేదిక మీద ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రాధా కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న మాట్లాడుతూ.. సింగపూర్‌లో ఉన్న అన్ని తెలుగు సంస్థల ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం తమ కల అని, అది ఈ రోజు నెరవేరిందని చెప్పారు. ఈ కార్యక్రమం స్పూర్తితో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నీతి పద్యాల పోటీకి న్యాయ నిర్ణేతలుగా రాంబాబు పాతూరి, అపర్ణ గాడేపల్లి, సౌభాగ్యలక్ష్మి తంగిరాల వ్యవహరించారు.