DailyDose

600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌-వాణిజ్య-07/08

indian-sensex-loses-600-points-daily-breaking-news-july82019

* అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బడ్జెట్‌ ప్రతికూలతలతో దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడం, ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా సూచీల పతనానికి కారణమయ్యాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే కుప్పకూలిన మార్కెట్లు.. అంతకంతకూ దిగజారుతూ భారీగా నష్టపోతున్నాయి.
* ఎల్ఐసీ కొత్త పాలసీ.. రోజుకు రూ.29లతో రూ.2 లక్షలు!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) ఇటీవల మైక్రో బచత్ పేరుతో కొత్త పాలసీని తీసుకువచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన తొలి మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇది. రక్షణతో పాటు పొదుపు అంశాల కలయికతో ఈ పాలసీని రూపొందించారు. ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీసం రూ.50,000కు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. మైక్రో బచత్ పాలసీని తీసుకునేవారు 18 నుంచి 55 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. పాలసీని కనీసం 10 నుంచి 15 ఏళ్లపాటు కొనసాగించాలి. పాలసీ గడువు వరకు ప్రీమియం చెల్లించాలి.
* సాధారణ బడ్జెట్ నేపథ్యంలో గత వారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న మార్కెట్లు, చివరకు నష్టాలతో ముగిశాయి. దేశీయంగా చూస్తే.. ఆర్థిక గణాంకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. మేలో మౌలిక రంగం 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది.
* తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన పన్ను ప్రతిపాదనలతో ప్రభుత్వానికి అదనంగా రూ.30,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. అధికాదాయ (సూపర్ రిచ్) వర్గంపై సర్ఛార్జి పెంపు, పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకం, రోడ్డు సెస్సు పెంపుతో ఈ మొత్తం సమకూరుతుందని తెలిపారు.
* సార్వభౌమ బాండ్లు జారీ చేసి విదేశీ మార్కెట్ల నుంచి విదేశీ కరెన్సీలో నిధులు సమీకరిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ వెల్లడించారు. ‘బాండ్లు ఎంత పరిమాణంలో విడుదల చేయాలి? అక్కడ ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారు.. వంటి వాటిని పరిశీలించి ప్రక్రియ ప్రారంభిస్తాం. బహుశా సెప్టెంబరు చివరి వారంలో బాండ్ల జారీ ఉండొచ్చ’ని గార్గ్ వెల్లడించారు.
* విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డ్ (హెచ్ఎస్ఎల్) చరిత్రలోనే తొలిసారిగా రూ. 10 వేల కోట్ల విలువైన ఆర్డర్ను రక్షణ మంత్రిత్వశాఖ కేటాయించింది. ఈ ఆర్డర్లో భాగంగా ఐదు భారీ యుద్ధనౌకల్ని హెచ్ఎస్ఎల్ నిర్మించనుంది.
* రక్షణశాఖ ఆర్డర్ హిందుస్థాన్ షిప్యార్డ్కు కేటాయించడం సంస్థ చరిత్రలో కీలక మైలురాయి. టర్కీ సంస్థ నుంచి ఎలాంటి డిజైన్, సాంకేతిక సహకారాలు పొందాలన్న అంశంపై అంగీకారానికి వచ్చాం. నిర్మాణం ప్రారంభమయ్యాక, ఆరేడేళ్ల వరకు ముమ్మరంగా పనులు సాగుతాయి. రక్షణశాఖ అధికారులు చట్టపరమైన ప్రక్రియలు పూర్తిచేశాక, నౌకల నిర్మాణానికి అనుమతులు ఇస్తారు.
* మారుతీ సుజుకీ గత నెలలోనూ వాహనాల ఉత్పత్తిని తగ్గించేసింది. దీంతో వరుసగా అయిదో నెలలోనూ ఉత్పత్తిని తగ్గించినట్లయ్యింది. గత ఏడాది జూన్లో మొత్తం 1,32,616 వాహనాలను ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది జూన్లో 15.6% తగ్గించి 1,11,917 వాహనాలనే రూపొందించింది. ప్రయాణికుల వాహనాలు 2018 జూన్లో 1,31,068 ఉత్పత్తి చేయగా, గత నెలలో 16.34% తగ్గించి, 1,09,641 వాహనాలను మాత్రమే తయారు చేసింది.
* కేంద్ర బడ్జెట్లో ఆశించిన ప్రతిపాదనలేవీ లేకపోవడం వల్ల మదుపర్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ప్రభావం సూచీలపై పడి.. అవి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్కు దిశానిర్దేశం చేసే అవకాశం లేకపోలేదు.