భారత్ కేంద్రంగా వన్డే క్రికెట్ ప్రపంచ కప్ (ODI World Cup 2023) జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi stadium) వేదికగా పలు కీలక మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే స్టేడియంపై దాడి చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు జరిపిన అధికారులు.. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్‌ల మధ్య అక్టోబర్ 14న మ్యాచ్ జరగనుంది. దీంతో అక్కడ భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేడియాన్ని పేల్చేస్తాననంటూ ఓ వ్యక్తి అక్కడి అధికారులకు ఈ-మెయిల్ పంపించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అతడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందినవాడని.. ప్రస్తుతం అతడు రాజ్‌కోట్ శివారు ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి ఫోన్ నుంచే ఈ బెదిరింపు మెయిల్ పంపించినట్లు కనుగొన్నారు. అయితే, గతంలో అతడికి ఎటువంటి నేర చరిత్ర లేదని అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు.
ఇదిలాఉంటే, అక్టోబర్ 14న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో 11వేల మందితో భద్రతా ఏర్పాటు చేసినట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. నరేంద్రమోదీ స్టేడియం వద్ద స్థానిక పోలీసులతోపాటు ఎన్ఎస్జీ, ఆర్ఏఎఫ్, హోంగార్డులు ఇతర విభాగాల భద్రతా సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here