Business

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ బాదుడు షురూ చేసింది. పేద, మధ్య తరగతుల ప్రయోజనాలు పక్కన పెట్టి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. పండుగల సందర్భంగా నగర వాసులు తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించిన దక్షిణ మధ్య రైల్వే రెగ్యులర్‌ విధానంలో కాకుండా ప్రత్యేక రైళ్లను అధిక సంఖ్యలో నడుపుతూ చార్జీలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం రెగ్యులర్‌ టికెట్‌ చార్జీలపై అదనంగా 30 నుంచి 50 శాతం వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు రైల్వే చార్జీలు తలకు మించిన భారంగా మారుతున్నది. పైగా రిజర్వేషన్‌కు దాదాపు రెండు నెలలు ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకున్నా.. సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అంతా వెయిటింగ్‌ లిస్టు, ఆర్‌ఏసీతోనే సరిపోతుంది. ఒక వేళ టికెట్‌ బుక్‌ చేసుకుని, టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే అందులో కూడా 25 నుంచి 50 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో 620 ప్రత్యేక రైళ్లు..
ఎస్‌సీఆర్‌ జోన్‌ ఆధ్వర్యంలో రెగ్యులర్‌ రైలు సర్వీసుల సంఖ్య తగ్గిస్తూ.. ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నాందేడ్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ వంటి డివిజన్ల పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 620 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.