వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందేనని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. అయితే ఆ మూడు రోజులు ఏవనేది ఉద్యోగుల ఇష్టానికే వదిలేయడం ద్వారా, వారికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ సి విజయకుమార్ తెలిపారు. ఇప్పటికే కొన్ని స్థాయిల ఉద్యోగులకు, కార్యాలయాలకు రావడం తప్పనిసరి చేశామని.. ఈ0 నుంచి ఈ3 గ్రేడ్ల సిబ్బందికి మాత్రం తప్పనిసరి చేయలేదని విజయకుమార్ అన్నారు. ఇక నుంచి అందరికీ (ప్రత్యేక పరిస్థితుల్లో మినహా) వారంలో మూడు రోజుల పాటు కార్యాలయం నుంచి పని ఉంటుందన్నారు. పూర్తిగా ఇంటి నుంచి పని అనేది మంచి ఆలోచనేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అది కంపెనీకి, సిబ్బందికీ కూడా మంచిది కాదన్నారు. ఇప్పటికే టీసీఎస్ తన ఉద్యోగులను అన్ని పనిదినాల్లోనూ కార్యాలయానికే వచ్చి పనిచేయాలని కోరింది. తద్వారా కరోనా సమయంలో మొదలైన పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్) సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఇన్ఫోసిస్ మాత్రం ఈ విషయంలో పెద్దగా పట్టుబట్టడం లేదు.