NRI-NRT

తెలంగాణలో పెరిగిన ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు

తెలంగాణలో పెరిగిన ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు

విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు.. రాష్ట్రంలో ఓటు హక్కుపై ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో 2014లో ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల సంఖ్య అయిదు కాగా.. 2018కి 244కు.. ప్రస్తుతం 2,780కి చేరడం ఇందుకు అద్దం పడుతోంది. రాష్ట్రంలోని బోధ్‌, నారాయణ్‌ఖేడ్‌ మినహా మిగిలిన 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఓటర్లు నమోదుకావడం మరో విశేషం. రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ఎన్‌ఆర్‌ఐలలో పురుషులు 2,248 మంది, మహిళలు 531 మంది, ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 206 మంది నమోదయ్యారు. 131 ఓట్లతో ఉప్పల్‌, 102 ఓట్లతో కూకట్‌పల్లి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆరు నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరు చొప్పున ఉన్నారు.

పాస్‌పోర్టే ఓటరు కార్డు
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లకు ప్రత్యేకంగా ఓటరు గుర్తింపుకార్డు ఉండదు. ఒరిజినల్‌ పాస్‌పోర్టును చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటర్ల జాబితాలోనూ వీరిని ప్రత్యేకంగా నమోదు చేస్తారు.

రాష్ట్రం నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన వారు మాత్రమే ఇక్కడ ఓటరుగా నమోదుకు అర్హులు. పాస్‌పోర్టులో పేర్కొన్న చిరునామా పరిధిలోనే వారు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి. విదేశాల్లో పౌరసత్వం పొందిన వారు మన దేశంలో ఓటరుగా నమోదుకు అనర్హులు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z