NRI-NRT

రామ్‌మాధవ్‌ను తానా అవమానించలేదు: వేమన-మూల్పూరి వివరణ

TANA Did Not Insult Ram Madhav Says Mulpuri And Vemana On Him Being Booed At 22nd TANA Conference

వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించిన 22వ తానా మహాసభల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్‌కు అవమానం జరిగిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఆయనకు భారీ డప్పులతో అమెరికా రాజధాని నగరంలో తానా ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి ఆయనకు ప్రధాన వేదికపై ప్రముఖ స్థానం కల్పించామని తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావులు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. 22వ తానా సభలకు అన్ని రాజకీయ పార్టీల నుండి ప్రజాప్రతినిధులను ఆహ్వానించామని అందరికీ సమున్నత రీతిలో సమాదరణ కల్పించామని వారు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, వైకాపా నుండి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు, వైకాపా విప్ కోరముట్ల శ్రీనివాసులు, తెదేపా నుండి పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, తెలంగాణా కాంగ్రెస్ నుండి భట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, తెరాస నుండి రసమయి బాలకిషన్, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, కామినేని శ్రీనివాస్, భాజపా నుండి రామ్‌మాధవ్, ఎంపీ సీ.ఎం.రమేష్‌లకు ఈ సభల్లో వారి గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఆదరించామని వీరు తెలిపారు. రామ్‌మాధవ్ ప్రసంగానికి 15నిముషాలు కేటాయించగా ఆయన 12నిముషాల ప్రసంగం అనంతరం తానా సభలకు వచ్చిన వెనుక చివరి వరుసలోని అతిథులు కొందరు అడ్డుతగిలారని, ముందు వరుసలో ఉన్న తానా కార్యవర్గ సభ్యులు గానీ, ప్రతినిధులు గానీ, విరాళాలు అందించిన దాతలు గానీ రామ్‌మాధవ్ ప్రసంగానికి అడ్డుచెప్పలేదని పేర్కొన్నారు. 20వేల మంది ప్రవాస అతిథులు సభలో నిండుగా ఉన్నప్పుడు రామ్‌మాధవ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారని, అలంటి సందర్భంలో ఎవరో వెనుక వరుసలోని వారు వేసిన కేకలు రామ్‌మాధవ్‌ను ఉద్దేశించినవి కావని, ఆయనను తానా సంస్థ అపారంగా గౌరవిస్తోందని సతీష్, వెంకటరావులు తెలిపారు. రామ్‌మాధవ్‌ను అనంతరం ఘనంగా సన్మానించామని ఆయన కారులో విమానాశ్రయానికి వెళ్లబోయే ముందు కూడా సభలోని ఏర్పాట్ల పట్ల హర్షం వెలిబుచ్చారని తెలిపారు. తానా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను సమరీతిలో గౌరవిస్తుందని రామ్‌మాధవ్‌ను సంస్థ అవమానించిందనేది వాస్తవ విరుద్ధమని, అలాంటి వార్తలను తాము ఖండిస్తున్నామని వీరు వెల్లడించారు.