హమాస్ (Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ( Israel) గాజాపై దాడులను తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో టెల్‌అవీవ్‌కు అమెరికా (America) పూర్తి మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ సాయం అందుతోంది. తాజాగా మరో విమాన వాహక నౌకను మధ్యధరా సముద్రంలో మోహరించింది.
ఇజ్రాయెల్-హమాస్ పోరులో మూడో దేశం జోక్యం చేసుకోకుండా అరికట్టేందుకు ఈ నౌకను అమెరికా పంపింది. దీంతో పాటు యూఎస్ఎస్ ఐసన్‌హోవర్ తన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌తో ఇజ్రాయెల్ తీరానికి తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న ద యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వాహక నౌక బృందంతో కలిసి పనిచేయనుంది. ‘‘ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందనే విశ్వాసం కల్పించేందుకు, మూడో దేశం లేదా గ్రూపు ఈ వివాదంలో జోక్యం చేసుకొనే ముప్పును నివారించడానికి ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు.
ఈ గ్రూప్‌లో డిస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు, ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇదిలా ఉండగా.. హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరులో ఇరువైపుల దాదాపు 3,500 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతిదాడిలో 2,200 మందికి పైగా గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
👉 – Please join our whatsapp channel here