Devotional

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు ఎర్నిమాంబ అమ్మవారు

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు ఎర్నిమాంబ అమ్మవారు

సంతానం కల్పించే దేవతగా విలసిల్లుతున్న దేవత

సృష్టికి మూలం ఆధిశక్తి. ఆమె తన అంశాలతో భిన్న రూపాల్లో భక్తులను కష్టాల నుంచి ఆదుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చి ఇష్టదైవంగా విలసిల్లుతున్నారు. ఆ కోవలోనే విశాఖలోని జ్ఞానాపురం వద్ద ఎర్నిమాంబ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నారు. ఈ వారం ఆలయంలో అమ్మవారి విశేషాలను పరికిద్దాం.

విశాఖ ఆవిరాÄ్భవం నుంచి భిన్న దేవతలు కొలువు దీరి ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారు. అందులో బురుజుపేట లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు, అస్సాం గార్డెన్స్‌ లోని నీలమ్మ వేప చెట్టు అమ్మవారు, పెదవాల్తేరు కరక చెట్టుపోలమాంబ అమ్మవారు ఇలా ఎందరో ఉన్నారు. ఈ కోవలోనే ప్రస్తుతం జ్ఞానాపురం, చావులమదుం రోడ్డులో ఎర్నిమాంబ అమ్మవారు భక్తులను కాపాడుతున్నారు. జ్ఞానాపురం, ఎంఎస్‌ఎం కాలనీ పరిసర ప్రజలకు ఇలవేల్పుగా మొదలైన అమ్మవారు ఇప్పుడు ఉత్తరాంధ్ర, ఒడిసా, చత్తీష్‌ ఘడ్‌ రాష్ట్రాల భక్తులకు ఆరాధ్యదైవంగా మారారు. ఆలయ చరిత్రపై ఖచ్చితమైన సమాచారం లేకున్నా పూర్వం అచ్చయ్యమ్మపేటలో కొందరు అమ్మవారిని పూజించేవారు. ఆ తరవాత జ్ఞానాపురం సమీపంలో ఖాళీ స్థలం ఉండటంతో ఇక్కడ విగ్రహాన్ని తరలించినట్టు చెబుతుంటారు. అలా దాదాపు 50 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ అమ్మవారిని తాటాకు నీడలో పూజలు మొదలు పెట్టారు. జ్ఞానాపురం గ్రామస్థులు, పరిసర రైల్వే ఉద్యోగుల కుటుంబాలు అమ్మవారిని పూజించేవారు. ఆమె చెవిలో కష్టం చెబితే ఇట్టే తీరిపోతుందని చెప్పడం, అవి ఇట్టే తీరి పోతాయని భక్తుల నమ్మకం. ఈ దశలో భక్తుల తాకిడి పెరగటంతో భక్తులుతమ విరాళాలతో ఆలయ నిర్మాణం చేపట్టారు. భక్తుల నుంచి విరాళాలు రావడంతో దేవాదాయ శాఖ కూడా తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆలయ నిర్వహణ వ్యవహారాలను దేవాదాయ శాఖ పర్యవేక్షణలోనే జరుగుతోంది.

గుర్రం వాహనంతో అమ్మవారు

ఇక్కడి ఎర్నిమాంబ అమ్మవారు గుర్రం వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ప్రతీ రోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో పూజలు చేస్తుంటారు. ప్రత్యేకంగా అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం మాత్రం వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు. మే నెలలో అమ్మవారి వార్షిక వేడులకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలావుండగా ఈ అమ్మవారిని హిజ్రాలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీపావళి పండగ రోజుల లక్షల రూపాయలు వెచ్చించి బాణాంచా కాల్చడం, అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించడం చేస్తారు. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు.

కుటుంబాలతోనే వేడుక

మొక్కులు తీరే భక్తులు కుటుంబాలతో కలిసి అమ్మవారిని పూజించడానికి తరలివస్తుంటారు. ప్రధానంగా ఆదివారం తమ బంధు మిత్రులను ఇక్కడ పిలిపించి మొక్కులు తీర్చి వంటలు చేసుకుంటారు. అక్కడే భోజనాలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని పూజిస్తే అన్ని రకాల కష్టాలు తీరడంతో పాటు సంతానం లేని వారికి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆ క్రమంలో చాలా మంది విదేశాలకు వెళ్లారని జ్ఞానాపురానికి చెందిన కోటేశ్వర్రావు ఫీచర్స్‌ ఇండియాతో అన్నారు. గతంలో స్థానిక భక్తులు మాత్రమే ఉండగా గత రెండు దశాబ్ధాలుగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తులు సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటీవల రోడ్డు విస్తరణలో ఆలయం విస్తీర్ణం కొంత తగ్గినా భక్తులు మాత్రం ఇబ్బందుల మద్యే దర్శనాలు చేసుకుంటున్నారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z