ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ పార్టీతో చేరారు. జనగామ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభా వేదికగా ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలో చేరాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య.. 16న కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించారు.45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉండి అవమానాలకు గురయ్యానని పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే కులగణన, సమగ్ర సర్వే చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారని పొన్నాల స్పష్టం చేశారు. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు. జనగామలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నామని పొన్నాల ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
👉 – Please join our whatsapp channel here