ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవులకు అన్నం ప్రసాదించే దేవత… అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సర్వ జీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలోని బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటెతో తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే అంశం అద్భుతం. సర్వ పుణ్య ప్రదాయకం. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏదీ లేదు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు సైతం అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారనేది ప్రతీతి. తెల్లవారుజాము 4 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు, చండీహోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.