* తిరుమల మాడ వీధుల్లో ఏనుగుల హల్ చల్
తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. తిరుమల మాడ వీధుల్లో ఏనుగుల హల్ చల్ చేశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి వేంకటేశ్వర స్వామివారు హంసవాహనంపై సరస్వతీ అలంకారంలో వీణ ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.ఈ క్రమంలో గ్యాలరీలో ఉన్న ఓ భక్తురాలి అరుపులతో గున్న ఏనుగులు బెదిరాయి. వెంటనే అప్రమత్తమైన మావటీలు వాటిపైకి ఎక్కి వాటిని అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. భక్తులను టిటిడి సిబ్బంది దూరంగా పంపింది. అనంతరం ఏనుగులను గోశాలకు తరలించారు మావటీలు. మరోవైపు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
* టీడీపీకి విజయసాయిరెడ్డి చురకలు
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట. క్యాండిడేట్లు దొరకడం లేదని అనుకోవాలా?’ అంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీకి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.‘‘87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.‘వీళ్లు చేసే ‘సంకెళ్ల’ ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే ‘సెలెబ్రేషన్స్’ ప్రజలకు చంద్రబాబు గారు చేసిన స్కాంల గురించి అవగాహన పెంచుతున్నాయి. నిరసన పేరుతో వీళ్లు డ్రామాలు చేసిన ప్రతిసారి ఒక వర్గం వాళ్లే తల్లడిల్లిపోతున్నారు. బాబు గారి జైలు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయట పడ్డాయి’’ అంటూ మరో ట్విట్‌లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
* ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్.. మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేముల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (77) ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
* రేవంత్ను కలిసిన బోధ్ ఎమ్మెల్యే
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాపురావును బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా పక్కనబెట్టింది. ఆయన స్థానంలో అనిల్ జాదవ్ అనే నేతకు టికెట్ కేటాయించింది. దీంతో అసంతృప్తితో ఉన్న నేత బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
* షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆఫ్రిది చెల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే తన చెల్లిని చూసేందుకు వెళుతున్నానని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానని రాత్రి షాహిద్ ఆఫ్రిది ట్వీట్ చేశాడు. కానీ విదిరాత మరోలా ఉంది. విషాద వార్త తెలియగానే షాహిద్ సహా అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
* గ్రేటర్ లో బీఆర్ఎస్ కు భారీ దెబ్బ
ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుష షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని చాలా మంది ఆశావహులు చాలా మంది ఆపార్టీని వీడారు. లేటెస్ట్ గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట్ కార్పొరేటర్ గా ఉన్న తన భార్య పూజితతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లో తన నివాసంలో రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.జగదీశ్వర్ గౌడ్ శేర్లింగంపల్లి బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అయితే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడిగాంధీకే మళ్లీ టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన అక్టోబర్ 16న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భార్యాభర్తలుగా గెలిచిన కార్పొరేటర్లుగా జగదీశ్వర్, పూజిత రికార్డు సృష్టించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్ నుంచి జగదీశ్వర్ గౌడ్ మూడోసారి గెలవగా… ఆయన భార్య పూజిత హఫీజ్ పేట డివిజన్ నుంచి రెండోసారి పోటీచేసి గెలుపొందారు.
* పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఓదెల జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను గంట రాములు ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్‌లో గంట రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయం, ఆత్మగౌరవం లేని చోట ఉండేది లేదన్నారు. పార్టీ టికెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి రూ. 50,000లు తీసుకున్నారని ఆరోపించారు. తమకు 80 మందికి కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.. మాతో మాట్లాడలేదు. తెలంగాణ బీసీలకు కనీసం గౌరవం లేదని మండిపడ్డారు.తుమ్మల నాగేశ్వర్ రావు రెండుసార్లు ఓడితే గొప్పనాయకుడు ఎలా అయ్యారు..? రెండుసార్లు ఓడిన పొన్నాల సిగ్గులేదనే మాటలు పడాలా..? అని గంట రాములు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు.. రాబోయే రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటిస్తాం. అన్యాయం జరిగిన చోట ఆత్మగౌరవం లేని చోట ఉండేది లేదు. రేపు మరింత ముఖ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని గంట రాములు ప్రకటించారు.
* వరుణ్ లావణ్యకు అల్లు ఫ్యామిలీ మెగా పార్టీ
టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్(Varun tej), లావణ్య(lavanya) త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్ లో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. దీనికి సంబందించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. పెళ్లి డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. నవంబర్ 1న డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అది కూడా ఇటలీలో. ఎంతో ఘనంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని టాక్.ఇటీవల ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగిన విషయం విషయం తెలిసిందే. ఈ పార్టీని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ జంటకు అల్లు ఫ్యామిలీ పార్టీ ఇచ్చింది. అల్లు వారింట జరిగిన ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ సభ్యులంతా హాజరయ్యారు. అంతేకాదు ఇండస్ట్రీ నుండి హీరో నితిన్, ఆయన భార్య, రీతూ వర్మ కూడా అటెండ్ అయ్యారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* రాహుల్ ప్రియాంక పర్యటన ఖరారు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. రేపు సాయంత్రం ములుగు నియోజకవర్గంలో రామప్ప ఆలయాన్ని వారు సందర్శించనున్నారు. తదనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు రామప్ప ఆలయం నుంచి రామానుజపురం వరకు విజయ భేరి యాత్రలో పాల్గొంటారు. అనంతరం రామానుజపురంలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.