రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్రహ్మాండంగా సిద్దిపేటను అభివృద్ధి చేశారని కొనియాడారు. ఇక సిద్దిపేటకు అన్ని వచ్చాయ్.. ఒక గాలి మోటార్ రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సిద్దిపేటకు ఏం జరిగిందో నేను చెప్తే బాగుండదు. నేను హరీశ్‌రావును పొగిడినట్టు అయితది. ఒకటే మాటకు నూరు అర్థాలు తీసుకోవాలి అని కేసీఆర్ సూచించారు. నేను కరీంనగర్ ఎంపీగా గెలిచాను.. తెలంగాణ కోసం ఢిల్లీకి పోయి పని చేయాలి. రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోవాలి. నా కన్న ఊరిని, నన్ను పెంచిన మిమ్మల్ని అందర్నీ విడిచి పెట్టిపోవాలి. అక్కడ కరీంనగర్ రోడ్డులో ఓ హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఓ దిక్కు నేను ఏడ్వ.. ఇంకో దిక్కు హాల్ మొత్తం ఏడ్వ.. అందరం కూడా ఓ పది నిమిషాలు ఏడ్సినం అని కేసీఆర్ తెలిపారు.
హరీశ్‌పై మంచి జోక్ ఉంది..ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో నేను తీసుకొచ్చి ఓ ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌ను మీకు అప్పగిస్తే, బ్రహ్మాండంగా నేను ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా పని చేసి నా మాటను నిలబెట్టాడు. మీ గౌరవాన్ని కాపాడాడు అని ప్రశంసల వర్షం కురిపించారు. హరీశ్ రావు మీద మన ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో ఒక జోక్ ఉంది. జోక్ ఏందంటే.. హరీశ్ అటు తిరుగుతడు.. ఇటు తిరుగతడు.. ఎక్కడన్నా ఓ తట్టెడు పెండ కనబడితే తీసుకుపోయి సిద్దిపేటలో వేసుకుంటడు అని చెబుతారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
హరీశ్ జాగలా నేనున్న ఇంత పని చేయకపోయేవాడినేమో..ఆయన టైమ్‌లో మంత్రి నుంచి నేటి దాకా ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో హరీశ్ అద్భుతమైన కృషి చేశారని సీఎం తెలిపారు. నిజంగా హరీశ్ జాగలా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుదోనో లేదో నాకు తెల్వదు. అంత అద్భుతంగా పని చేస్తున్నారు. నేను ఇంతకన్న ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సిద్దిపేటకు నీళ్లు, రైళ్లు వచ్చాయి. కన్నీరు కార్చిన సిద్దిపేటలో చెక్ డ్యాంలన్నీ పన్నీరు కారినట్టు మత్తల్లు దుంకుతున్నాయి. ఆ ఫోటోలు చూసి సంతోషపడుతున్నాను. నంగునూరు పెద్దవాగు మీద చెక్ డ్యాంలు చూసినప్పుడు బ్రహ్మాండంగా మనసు పులకించి పోయిందని కేసీఆర్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –