* ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతి
బియ్యం ఎగుమతుల (Rice Export) విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది. దేశంలో నాన్ బాస్మతి తెల్ల బియ్యం కొరతను నివారించేందుకు, ఆ బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం గత జూలైలో వాటి ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, నేపాల్ (Nepal), మలేషియా (Malaysia), ఫిలిప్పీన్స్ (Philippines), సీషెల్స్ (Seychelles), కామెరూన్ (Cameroon), ఐవొరీ కోస్ట్ (Ivory Coast), రిపబ్లిక్ ఆఫ్ గినియా (Republic of Guinea) దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిణామాలతో ఎగుమతి చేయడానికి తాజాగా కేంద్రం అనుమతించింది.నేషనల్ కోపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్రం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు దేశాలకు 10,34,800 టన్నుల నాన్ బాస్మతి రకం తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం సమ్మతించింది. నేపాల్‌కు 95,000 టన్నులు, కామెరూన్‌కు 1,90,000 టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1,42,000 టన్నులు, రిపబ్లిక్ ఆఫ్ గినియాకు 1,42,000 టన్నులు, మలేషియాకు 1,70,000 టన్నులు, ఫిలిప్పీన్స్‌కు 2,95,000 టన్నులు, సీషెల్స్‌కు 800 టన్నుల తెల్లబియ్యం ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, అంతకుముందు యూఏఈ, సింగపూర్ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించిన విషయం తెలిసిందే.
* ఇక రైల్లోనూ జొమాటో ఫుడ్ డెలివరీ
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు IRCTC, రైలు టిక్కెట్ రిజర్వేషన్ సేవను అందించే పోర్టల్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ Zomato ద్వారా రైలులోని మీ బెర్త్‌కు మీకు ఇష్టమైన ఆహారాన్ని డెలివరీ చేస్తుంది. ఇందుకోసం జొమాటోతో IRCTC ఒప్పందం చేసుకుంది. IRCTCతో ఈ ఒప్పందం తర్వాత బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్లో Zomato స్టాక్ ఒక సంవత్సరం గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది.స్టాక్ ఎక్స్ఛేంజ్తో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో IRCTC జొమాటోతో ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ఆహారాన్ని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. IRCTC ఇ-కేటరింగ్ కింద ఆర్డర్ చేయగల ఆహార పదార్థాల పరిధిని విస్తరించవచ్చని IRCTC తెలియజేసింది. ఈ మేరకు ఎంవోయూ పై సంతకం అయిపోయింది. . ఈ ఒప్పందం ప్రకారం Zomato IRCTC ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడం మొదటి దశలో ఐదు రైల్వే స్టేషన్లలో అంటే న్యూఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసిలో చేయబడుతుంది.మొదటి దశలో ఐదు రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఫుడ్ డెలివరీ కోసం ఇతర రైల్వే స్టేషన్లు కూడా Zomatoతో అనుసంధానించబడతాయి. IRCTC ఇ-క్యాటరింగ్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా మీరు మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.ఈ వార్తల కారణంగా బుధవారం ట్రేడింగ్ సెషన్లో జోమాటో స్టాక్‌లో భారీ పెరుగుదల కనిపించింది. రోజు ట్రేడింగ్‌లో జోమాటో షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ.115.10కి చేరుకుంది. అయితే మార్కెట్ పతనంతో ఈ షేరు పతనమై ప్రస్తుతం రూ.110.60 వద్ద ట్రేడవుతోంది. IRCTC షేర్లు 1.60 శాతం క్షీణతతో రూ.703.20 వద్ద ట్రేడవుతున్నాయి.
* చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
పండగ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చక్కెర ఎగుమతులపై ఆంక్షలను అక్టోబర్ 31 వరకు విధించగా, తాజాగా ఆ గడువును మరింత కాలం పొడిగించింది. ఈ ఆంక్షలు ఎప్పటి వరకు ఉంటాయో ప్రభుత్వం పేర్కొనలేదు. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ముడి చక్కెర, తెల్ల చక్కెర , శుద్ధి చేసిన చక్కెర, సేంద్రీయ చక్కెరపై ఈ ఆంక్షలు ఉంటాయి.ప్రస్తుతం సీజన్ మొత్తం కూడా పండగలతో నిండి ఉంది. ఇలాంటి తరుణంలో ప్రజలు రోజు వినియోగించే చక్కెర అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. దీంతో ధరలు కూడా పెరగకుండా ఉంటాయని డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పేర్కొంది. CXL, TRQ పన్ను రాయితీ కింద ఐరోపా సమాఖ్య, అమెరికాకు ఎగుమతి చేసే చక్కెర ఎగుమతులపై ఈ ఆంక్షలు వర్తించవని అధికారులు తెలిపారు.
* ఐటీలో ఆగని లేఆఫ్స్ కలకలం
ఐటీ రంగంలో లేఆఫ్స్ (Layoffs) కలకలం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డిన్ తన ఇంజనీరింగ్, ప్రోడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన 668 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవల వ్యాపార పునర్వ్యవస్ధీకరణ పేరుతో 5000 మంది ఉద్యోగులను తొలగించింది.గత రెండేండ్లుగా ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు టెక్ దిగ్గజాలు తెగబడుతుండగా ఈ ట్రెండ్ కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రతి గంటకూ 23 మంది టెకీలు కొలువులు కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 2120 టెక్ కంపెనీలు 4,04,962 మంది టెకీలను సాగనంపాయని లేఆఫ్.ఎఫ్‌వైఐ డేటా తెలిపింది.
2022లో 1061 టెక్ కంపెనీలు 164,769 మంది ఉద్యోగులపై వేటు వేయగా 2023లో 1059 కంపెనీలు అక్టోబర్ 13 వరకూ 240,193 మంది ఉద్యోగులను తొలగించాయి. గత రెండేండ్లుగా ప్రతిరోజూ సగటున 555 మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోతున్నారు. 2022లో ప్రారంభమైన కొలువుల కోత 2023 ఆరంభానికి పీక్స్‌కు చేరి ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఇంకా లేఆఫ్స్ ట్రెండ్ పూర్తిగా సమసిపోలేదు. కేవలం గతనెలలోనే ఆర్ధిక మందగమనం కారణంగా 4632 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల బాటపట్టాయి. సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై చివరికి భారీ నష్టాలపాలయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 140 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 521 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 366 పాయింట్లు నష్టపోయాయి. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్న వేళ మార్కెట్ నిపుణులు కంపెనీల ఆదాయాలు ప్రతికూలంగా ఉంటాయని అంచనాలు వేసిన వేళ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మెుదలైంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు భారీ నష్టాలకు దారితీశాయి.
* 23న తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు నిలిపివేత
కేరళ రాజధాని తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం (Thiruvananthapuram airport) లో ఈ నెల 23న 5 గంటలపాటు విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు. ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయ సాంప్రదాయమైన ‘ఆరట్టు’ ఊరేగింపు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తిరువనంతపురం ఎయిర్పోర్ట్ తెలిపింది. పద్మనాభస్వామి ఆలయంలో జరిగే అల్పాసి ఆరట్టు ఊరేగింపు సందర్భంగా అక్టోబర్ 23 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్లైట్స్ అప్డేట్ టైమింగ్స్ కోసం ఆయా ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సూచించింది.కాగా, శతాబ్దాలుగా పద్మనాభస్వామి ఆలయంలోని విగ్రహాల పవిత్ర స్నానం కోసం షంగుముఖం బీచ్ వరకు ప్రతి ఏటా రెండు సార్లు ఊరేగింపు నిర్వహిస్తారు. 1932లో ఎయిర్పోర్ట్ నిర్మించినప్పటికీ రన్ వే మీదుగా ఈ ఊరేగింపు కొనసాగుతున్నది. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం అదానీ గ్రూప్ చేపట్టినప్పటికీ ఏళ్లనాటి రాచరిక సాంప్రదాయ ఆచారం కోసం ఈ నెల 23న ఐదు గంటలపాటు విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు.
* వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్టబుల్ ఫోన్
ఇప్పుడు మార్కెట్లో కొన్ని వేల రకాల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందులోంచి మనకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవడం కాస్త కష్టమైన పనే. ముందుగా మనం కొత్త ఫోన్ కొనాలంటే.. ఆ ఫోన్ కాస్ట్, ఫీచర్లు, కెమెరా క్వాలిటీ ఇవే చూస్తాం కదా..! మీ బడ్జెట్ కాస్త ఎక్కువైతే.. అందుకు తగిన ఫోన్లనే చూసుకుంటారు. ఈ మధ్య మడతపెట్టే ఫోన్ల హవా ఎక్కువైంది. సామ్సంగ్, ఒప్పోలో ఇప్పటికే ఫోల్టబుల్ ఫోన్స్ వచ్చాయి. చైనీస్ దిగ్గజం వన్‌ప్లస్ సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. వన్‌ప్లస్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ అక్టోబర్ 19న లాంచ్ కానుంది.వన్‌ప్లస్ కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్’ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 19న ఈ ఫోన్ భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది. వన్‌ప్లస్ ఓపెన్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 19న ముంబైలో జరగనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్, కంపెనీకి సంబంధించిన సోషల్ మీడియా పేజీల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు
కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ. 109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్యూయల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66,లీటర్ డీజిల్ ధర రూ. 98.31. విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ110.48.లీటర్ డీజిల్ ధర రూ.98,విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 11.76,లీటర్ డీజిల్ ధర రూ.99.