తొలి జాబితాపై తుది కసరత్తులో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కిషన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు డా. కే. లక్ష్మణ్, బండి సంజయ్ ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం బీజేపీ జాతీయాధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డాతో ఈ ముగ్గురు నేతలు సమావేశం కానున్నారు. అభ్యర్థుల జాబితా కసరత్తుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బుధవారం జరిపిన మంతనాల గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
ఈ భేటీలోనే తొలి జాబితాకు తుది మెరుగులు దిద్దే అవకాశం కూడా ఉంది. అనంతరం సాయంత్రం బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ జాబితాపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. సుమారు 50-60 మందితో తొలి జాబితా విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బరిలో బడా నేతలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బడానేతలందరినీ దించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్న వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కమలదళ నాయకత్వం నిర్ణయించిన పక్షంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ జాతీయ నాయకత్వంలో కీలక పదవుల్లో ఉన్న పెద్ద నేతలందరినీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలను ఒకే ప్రాంతం నుంచి బరిలోకి దించింది. మధ్యప్రదేశ్‌లో పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చంబల్ ప్రాంతంలో పార్టీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్ అభ్యర్థుల 2వ జాబితాలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తేతో పాటు ఎంపీలు రాకేష్ సింగ్, గణేష్ సింగ్, రీతి పాఠక్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.
ఈ ఏడుగురు నేతలు తమకు కేటాయించిన సీట్లతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేస్తారని, తద్వారా గత ఎన్నికల్లో తక్కువ సీట్లకే పరిమితమైన ఈ ప్రాంతంలో ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుపొందవచ్చని అధినేతలు భావిస్తున్నారు. దీనికితోడు కేంద్ర మంత్రుల స్థాయిలో వ్యక్తులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థులుగానూ ప్రచారంలోకి వస్తారు. తద్వారా ఆ నేతలను రాష్ట్రవ్యాప్తంగా అభిమానించే ఓటర్లు ప్రభావితమవుతారని పార్టీ భావిస్తోంది.
సీఎం అభ్యర్థిత్వం గురించి..
మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న సంకేతాలను పార్టీ ఎక్కడా ఇవ్వడం లేదు. తద్వారా సీఎం పదవిని ఆశిస్తున్న ఇతర నేతల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. వారిలో నరేంద్ర సింగ్ తోమర్ ముందంజలో ఉన్నారు. సీఎం అభ్యర్థిత్వం గురించి ఎలాంటి మాటా మాట్లాడకుండానే పార్టీ సరికొత్త చర్చకు ఆస్కారం కల్పించింది. ఫలితంగా తోమర్‌ను అభిమానించే పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంగా ఎన్నికల్లో పనిచేస్తోంది.ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బరిలోకి ఆ నేతలు..
జాతీయస్థాయిలో వివిధ పదవుల్లో ఉన్న తెలంగాణకు చెందిన బీజేపీ నేతలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడితో పాటు రాజ్యసభ సభ్యుడిగా, మరికొన్ని కీలక పార్టీ పదవుల్లోనూ ఉన్న డా. కే. లక్ష్మణ్, ఇతర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, జాతీయస్థాయి రాజకీయాల్లో ఉన్న మురళీధర్ రావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ తదితరులందరినీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఆయా నేతలు తమ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేస్తే భారతీయ జనతా పార్టీ గణనీయంగా తన సీట్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుందని అధినేతల వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి ఎక్కడా ప్రస్తావించకుండానే మధ్యప్రదేశ్ తరహాలో పరోక్షంగా పెద్ద నేతలను తెరపైకి తీసుకొచ్చినట్టవుతుంది.
హంగ్ సాధిస్తేనే కింగ్..అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ బలం ఏంటన్నది పార్టీ అధిష్టానం కూడా గ్రహించినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వస్తాయని, అయినా సరే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని, అందులో తమ పార్టీ బీజేపీకి కూడా రావని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. బీజేపీ సాధించే సీట్లే ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా మారతాయన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.
అనుకున్నట్లుగా జరగకుంటే..ఒకవేళ బీజేపీ ఆశించినన్ని సీట్లు సాధించలేకపోతే మిగతా రెండు పార్టీల్లో ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల యుద్ధాన్ని ముక్కోణపు పోటీగా మార్చి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పోలింగ్ తేదీ సమీపించేకొద్దీ రాష్ట్రంలో బీజేపీ కూడా ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేయాలని చూస్తోంది. నవంబర్ 28న సాయంత్రం గం. 5.00కు ప్రచారం ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను పాల్గొనేలా చేయాలని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –