ఉద్యోగులకు ప్రేరణ కలిగించి మరిన్ని ఎక్కువ గంటలు ఉత్సాహంగా పనిచేసేలా చూసే అద్భుత చాతుర్యం స్టీవ్ జాబ్స్ లో అమితంగా ఉండేదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రశంసించారు. యాపిల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి (సీఈఓ) గా వ్యవహరించిన, స్టీవ్జాబ్స్ పాంక్రియాటిక్ క్యాన్సర్తో 2011లో మరణించిన సంగతి విదితమే. నాయకత్వంపై సీఎన్ఎన్ చేసిన ఇంటర్వ్యూలో బిల్గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. మూసివేసే దశకు చేరుతున్న యాపిల్ను నిలబెట్టి, అత్యంత విలువైన సంస్థగా తీర్చిదిద్దడంలో స్టీవ్జాబ్స్ అసమాన నాయకత్వ ప్రతిభ చూపారని బిల్గేట్స్ వివరించారు. ‘స్టీవ్జాబ్స్ అద్భుత చాతుర్యం కలిగిన నిపుణుడు. ఆయన ధాటికి ప్రజలు మైమరచిపోయేవారు. అయితే నేను కూడా చిన్నపాటి మాంత్రికుడిని కావడం వల్ల, నేను మాత్రం బయట పడ్డాను’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు. ‘నైపుణ్యాన్ని వెలికితీసి, మరింతగా ప్రేరణ కలిగించే స్టీవ్జాబ్స్ వంటి మరో వ్యక్తిని మళ్లీ కలవలేదు’ అని గేట్స్ తెలిపారు. అలాంటి వ్యవహారశైలి వల్లే, ఎనలేని సానుకూల పరిణామాలను స్టీవ్ ఆవిష్కరించగలిగారని ప్రశంసించారు. స్టీవ్జాబ్స్ తరవాత యాపిల్ సీఈఓగా టిమ్ కుక్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే. మీ నాయకత్వ శైలి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బిల్గేట్స్ బదులిస్తూ ‘న్యాయశాఖ తీర్పులో మినహా, ఖాతాదార్లు లేదా విలేకరులు ఎవరూ కూడా నేను నిరంకుశంగా, మొరటుగా, ఆజ్ఞాపించేలా వ్యవహరిస్తాను అని చెప్పలేదు’ అని తెలిపారు.
స్టీవ్ జాబ్స్ లేకపోతే….
Related tags :