* బీజేపీ కార్యకర్త ఆత్మహత్య
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో శివకుమార్ అనే బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు ముందు తాను రికార్డ్ చేసిన ఆడియో క్లిప్‌లో, తన మరణానికి కర్ణాటక వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ , ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు కారణమని శివకుమార్ ఆరోపించారు. తన మరణానికి పాటిల్ ప్రత్యక్ష కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సులేపత్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆడియో క్లిప్‌లో స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఎఫ్ఐఆర్‌లో మాత్రం శివకుమార్ మృతికి అప్పులు, ఆర్ధిక సమస్యలను కారణంగా చూపారు. మరోవైపు శివకుమార్ ఆత్మహత్య వ్యవహారం కర్ణాటకలో రాజకీయాలను వేడెక్కించింది. మంత్రి పాటిల్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
* దసరా సెలవులకు వెళ్లిన విద్యార్థికి అస్వస్థత
కాలం మారిన.. సాంకేతికత పెరిగిన కొందరి జీవితాలు మాత్రం మారడం లేదు. రాకెట్ యుగంలో అంతరిక్షాన్ని సందర్శించి వస్తున్న ఈ రోజుల్లో కొందరు ఊరి పొలిమేర దాటడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన మార్గం లేక కనీస వైద్యం అంధక ప్రాణాలను కోల్పోతున్నారు. సరైన రహదారి లేక కాలినడకన డోలీలో నిండు గర్బిణిని మోసుకెళ్లిన ఘటనలు, అనారోగ్యంతో సరైన సదుపాయాలు లేక కాలినడకన ఆసుపత్రికి వెళ్లేసరికి మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా అల్లూరి ఏజెన్సీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. పెదబయలు మండలం లోని మారుమూల కుంబర్ల గ్రామానికి చెందిన అరడ కృష్ణ(10) అనే విద్యార్థి పెదబయలు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు.కాగా దసర సందర్భంగా పాఠశాలకు సెలవలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణ దసరా సెలవలకి ఇంటికి వచ్చాడు. అయితే ఉన్నటుండి కృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. దీనితో ఆ గ్రామానికి రహదారి సరిగా లేనందున బంధువులు డోలీలో కృష్ణను ఉంచి అతి కష్టం మీద గ్రామం నుండి అయిదు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ దగ్గరలో ఉన్న గోమంగి తరలించారు. అయితే వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. కృష్ణను పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు చనిపోయినట్టు తెలియ చేశారు. దీనితో బంధువులు తిరిగి మృత దేహాన్ని డోలీలో మోసుకుంటూ ఇంటికి తెలుసుకువెళ్లారు. కుమారుడి మరణముతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూన్నారు. సరైన రహదారి సౌకర్యం లేక, ఆశ్రమాల్లో భద్రత లేక తమ బిడ్డను కోల్పోయామని బందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* పీపీఈ కిట్స్ ధరించి మొబైల్ షాపులోకి చొరబడిన దొంగలు
పీపీఈ కిట్స్ (PPE Kits) ధరించిన దొంగలు ఒక మొబైల్ షాపులోకి చొరబడ్డారు. ఖరీదైన వంద మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. మొబైల్ షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి గంగా నగర్ ప్రాంతంలోని మొబైల్ షాపులో చోరీ జరిగింది. పీపీఈ కిట్స్ ధరించిన దొంగలు ఖాళీగా ఉన్న ఒక ఫ్లాట్ నుంచి పక్కనే ఉన్న మొబైల్ షోరూమ్‌కు రంధ్రం చేసి అందులోకి ప్రవేశించారు. సుమారు రూ.60 లక్షల విలువైన వంద మొబైల్ ఫోన్లు చోరీ చేశారు.కాగా, గురువారం ఉదయం షాపు తెరిచిన ఓనర్ మొబైల్ ఫోన్లు చోరీ జరిగినట్లు గ్రహించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ మొబైల్ షోరూమ్ వద్దకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. గుర్తించకుండా ఉండేందుకు దొంగలు పీపీఈ కిట్లు ధరించి ఆ షాపులోకి చొరబడి ఖరీదైన మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు గ్రహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* బాపట్లలో భారీ అగ్నిప్రమాదం
ఓ వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి ఏకంగా రూ.400 కోట్ల సొత్తు కాలిబూడిదయ్యింది. కార్మికుల కళ్లముందే మంటలు దావానలంలా వ్యాపించి పరిశ్రమ మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో వస్త్ర తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో పాటు మిషనరీ కూడా మంటల్లో ఆహుతి అయ్యింది. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.పరిశ్రమ కార్మికులు, ఉద్యోగులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలకేంద్రానికి సమీపంలో ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమ నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మంది కార్మికులు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. దసరా సీజన్ కావడంతో భారీగా వస్త్రాల తయారీ చేపట్టేందుకు వందలకోట్లతో ముడిసరుకును సిద్దం చేసుకున్నారు. ఇలా ఈసారి భారీగా బిజినెస్ చేయాలని యాజమాన్యం ప్లాన్ చేసిన సమయంలో అనుకోని ప్రమాదం వారిని నిండా ముంచింది.
* 11 ఏళ్ల బాలుడు ఆడిన కిడ్నాప్ నాటకం
బిహార్‌లోని గయ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడు ఆడిన కిడ్నాప్ నాటకం కుటుంబ సభ్యులతో పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వెంటనే రూ.5 లక్షలు పంపించాలని, లేకుంటే కిడ్నాపర్లు తనను చంపేస్తారని ఆ చిన్నారి తన తండ్రి ఫోన్‌కు మెసేజ్ చేయడం గమనార్హం. చదువుపై ఇష్టం లేక, ఇంట్లో వాళ్లకు భయపడి ఆ బాలుడు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఆ చిన్నారి ట్యూషన్ కోసమని బయటికి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికి తనతోపాటు తీసుకెళ్లిన మొబైల్ నుంచి తండ్రి ఫోన్‌కు సందేశం పంపాడు. ‘‘నన్ను కొందరు అపహరించారు. వెంటనే రూ.5 లక్షలు పంపించండి. లేకపోతే వారు నన్ను తుపాకీతో కాల్చి చంపుతారు’’ అని అందులో తెలిపాడు. దీంతో భయాందోళనలకు లోనైన కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫోన్ లొకేషన్ వివరాలు ట్రేస్ చేయగా గయ రైల్వే స్టేషన్ నుంచి ఆ మెసేజ్ పంపినట్లు తేలింది. ఆ తర్వాత ఫోన్ లొకేషన్ తరచూ మారుతుండటం గమనించారు. గయ-సహస్ర ప్యాసింజర్ రైల్లో వెళ్తున్న ఆ బాలుణ్ని గుర్తించారు. రాత్రి 2.30 సమయంలో ఆ చిన్నారిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
* కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరూ కలిసి ఆ ఇంటి పెద్దను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలో మాండ్యా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది. 45 ఏళ్ల వ్యక్తిని భార్య, కుమారుడు శుక్రవారం ఇంట్లో గొడవల కారణంగా చెక్క నాగలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్దూర్ తాలూకాలోని చపురదొడ్డి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన సంఘటన తర్వాత సవిత, ఆమె 24 ఏళ్ల కుమారుడు శశాంక్ ఇద్దరూ బెంగళూరుకు పారిపోయారని పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరినీ శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి పోలీసులు అరెస్టు చేశారు.
* ఇద్దరు వ్యక్తులపై సామూహిక అత్యాచారం
ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు బంగ్లాదేశ్ యువకులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 17న LGBTQ+ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు వ్యక్తుల మీద ఈ లైంగిక దాడి జరిగింది. వారికి పరిచయం ఉన్న ఓ వ్యక్తి తన నలుగురు స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తరువాత బాధితులిద్దరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయడానికి పిసిఆర్ అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే, షకర్పూర్ పోలీస్ స్టేషన్ నుండి 20 మంది పోలీసుల బృందం విచారణ ప్రారంభించింది.
* సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా కొత్త కొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులే వీరి టార్గెట్.. ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా వివరాలు సేకరించడం.. వారికి తెలియకుండానే లావాదేవీలు నడిపించడం ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. గ్రామాల్లోకి వెళ్లి అమాయకులకు కమిషన్ల ఆశచూసి వారి ధృవపత్రాలను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరిపించి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒడిశాలో వెలుగులోకి వచ్చిన ఘటన చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను దాచుకునేందుకు మ్యూల్ ఖాతాలను అమాయకులచేత తెరిపిస్తున్నారు. మధ్యవర్తులను నియమించుకొని కమిషన్లు ఇస్తూ ఖాతాదారులకు తెలియకుండా లావాదేవీలు కొనసాగిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –