NRI-NRT

బెంగళూరులోని కెనడా కాన్సులేట్ మూసివేత

బెంగళూరులోని కెనడా కాన్సులేట్ మూసివేత

భారత్-కెనడా దౌత్య వివాదం(Diplomatic row) మరింతగా ముదిరింది. దీని పర్యవసానాలు తొలిసారిగా భారతీయ విద్యార్థులపై పడ్డాయి. భారత్ ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో 41 మంది దౌత్యవేత్తలు, వారిపై ఆధారపడ్డ వారిని వెనక్కు పిలిపించుకున్న కెనడా ఇందుకు ప్రతిగా భారత్‌లోని కొన్ని కార్యాలయాల్లో కాన్సూలార్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. బెంగళూరు, చండీఘడ్, ముంబై కాన్సులేట్లలో వీసా, ఇతర ప్రత్యక్ష కాన్సులార్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు (Canada temporarily suspends visa inperson consular services) ప్రకటించింది. ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఫలితంగా వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం తప్పదని కూడా హెచ్చరించింది. ఈ మేరకు కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజన్‌షిప్ విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్య తగ్గిపోవడంతో వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై ప్రభావం పడుతుందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. కెనడా వెనక్కు పిలిపించుకున్న 41 మంది దౌత్య సిబ్బందిలో 27 మంది కెనడా వలసల విభాగానికి చెందిన వారే. దీంతో, కాన్సూలార్ సేవల్లో అంతరాయం కారణంగా 17,500 వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం( Delay in visa processing) జరుగుతుందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఫలితంగా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులు, ఇతర వర్గాలపై ప్రతికూల ప్రభావం తప్పదని పేర్కొంది.అయితే, ఈ అంశంలో కెనడా ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అనుసరించే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ లాయర్ రిచర్డ్ కర్లాండ్ పేర్కొన్నారు. కాన్సూలార్ సేవలకు సంబంధించి కెనడా ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఇక్కడి దరఖాస్తుల ప్రాసెసింగ్ ఇతర దేశాల్లోని దౌత్యసిబ్బందికి బదిలీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

కెనడా దౌత్యవేత్తలకు ఇచ్చే గుర్తింపు, రక్షణలను భారత్ ఉపసంహరింకుంటా మని భారత్ తేల్చి చెప్పడంతో కెనడా ప్రభుత్వం 41 మంది దౌత్యవేత్తలను , వారిపై ఆధారపడ్డ మరో 42 మందిని స్వదేశానికి పిలిపించుకుంది. ఈ విషయంలో భారత్ ‌గతంలో ఇచ్చిన రెండు వారాల గడువు ముగియడంతో కెనడా వారిని గురువారం వెనక్కు పిలిపించుకుంది. దీంతో, ప్రస్తుతం భారత్‌లో 27 మంది దౌత్యవేత్తలు మాత్రమే మిగిలున్నారు.కాగా, దౌత్యగుర్తింపు రద్దు చేస్తామని భారత్ అనడంపై కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దౌత్యపరమైన రక్షణలు తొలిగిస్తే ప్రపంచంలోని ఏ దౌత్యవేత్తకు పరాయి దేశాల్లో రక్షణ ఉండదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిబంధనలను భారత్ ఉల్లంఘించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, భారత దౌత్యవేత్తల విషయంలో తాము ఎలాంటి ప్రతిచర్యలకు దిగమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కెనడా కాన్సూలార్ సేవల తాత్కాలిక నిలిపివేతకు ప్రాధాన్యం ఏర్పడింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z