దేశీయంగా బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.750 పెరిగి రూ.61,650కు చేరింది. అంతర్జాతీయ భౌగోళిక పరిణామాల నేపథ్యంలో డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.60,900 వద్ద ముగిసింది. వెండి సైతం కిలో రూ.500 పెరిగి రూ.74,700కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడంతో దేశీయంగానూ వీటి ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1980 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి 23.80 డాలర్లుగా ఉంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య నెలకొన్న యుద్ధం వేళ సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపడమే కారణమని పేర్కొన్నారు. దీంతో బంగారం ధర నాలుగు నెలల గరిష్ఠానికి చేరిందని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –