Politics

జానారెడ్డికి కేటీఆర్ కౌంటర్-తాజా వార్తలు

జానారెడ్డికి కేటీఆర్ కౌంటర్-తాజా వార్తలు

రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినందుకు గాను రాజాసింగ్‌ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. 2022 ఆగస్ట్ 23న బీజేపీ నాయకత్వం రాజా సింగ్‌ను సస్పెండ్ చేసింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని కోరారు. ఈ విషయమై జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ క్రమశిక్షణా సంఘం ఇవాళ వెల్లడించింది.

జానారెడ్డికి కేటీఆర్ కౌంటర్

తనకు సంస్కారం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు పిండం పెట్టాలన్నప్పుడు జానారెడ్డి సంస్కారం ఎక్కడ పోయింది.. జానారెడ్డి సంస్కారాన్ని ముందు వాళ్ల పీసీసీ ప్రెసిడెంట్‌కు నేర్పించాలని కౌంటర్ ఇచ్చారు. రాళ్లతో కేసీఆర్‌ను కొట్టి చంపాలన్నప్పుడు మీ సంస్కారం ఏమైందని నిలదీశారు. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదని ఫైర్ అయ్యారు. రూ. 50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. టికెట్లకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని సొంత పార్టీ నేతలే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే రిపోర్ట్ వచ్చింది. ఓట్ షేర్ పై మిషన్ చాణక్య సర్వే చేయగా…బీఆర్ఎస్ కు 44.62%, కాంగ్రెస్ కు 32.71%, బిజెపికి 17.6%, ఇతరులకు 5.07% ఓట్లు వస్తాయని అంచనా వేసింది బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆదిక్యం వస్తుందని సర్వే రిపోర్ట్ తేల్చింది. అటు నిన్న విడుదలైన ఇండియా టీవీ సర్వే కూడా బిఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది.

*   మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు

 మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలోని కొండచిలువతో పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ అతడి మెడను చుట్టి గొంతునొక్కడంతో కిందపడిపోయాడు. (Python Strangulates Drunk Man) స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి మద్యం సేవించిన చంద్రన్‌ మెడలో కొండచిలువ వేసుకుని వలపట్టణంలోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లాడు. మెడలోని కొండచిలువతో సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు.కాగా, చంద్రన్‌ మెడలో ఉన్న కొండచిలువ అతడి మెడకు గట్టిగా చుట్టుకుంది. దీంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిన అతడు కింద పడిపోయాడు. ఇది చూసి పెట్రోల్‌ బంకులో పనిచేసే అభిషేక్‌ వెంటనే స్పందించాడు. ఒక కవర్‌ సంచితో చంద్రన్‌ వద్దకు వెళ్లాడు. అతడి మెడకు చుట్టుకుని ఉన్న కొండచిలువను విడిపించేందుకు ప్రయత్నించాడు. చివరకు చంద్రన్‌ మెడను వీడిన ఆ కొండచిలువ పక్కకు వెళ్లిపోయింది. మరోవైపు ఈ షాకింగ్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

హైదరాబాద్‌ పాతబస్తీలో MIM ఎన్నికల ప్రచారం

తెలంగాణ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీలు వరాలు జల్లులు కురిపిస్తామని హామీలు ఇస్తున్నాయి. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే మహిళలకు, సామాజికవర్గాల వారీగా పెద్ద పీట వేస్తామని ఓటర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికతోపాటు మేనిఫెస్టోలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి.మరోవైపు.. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఎంఐఎం కూడా ప్రత్యేక స్ట్రాటజీతో హైదరాబాద్‌ పాతబస్తీలోని ప్రజల్లోకి వెళ్తోంది. పగలు కార్యకర్తలు వాళ్లవాళ్ల పనుల్లో ఉండటంతో సాయంత్రం, నైట్ వేళల్లో టైమ్‌ దొరికినప్పుడు ప్రజలతో ఎంఐఎం సమావేశాలు నిర్వహిస్తోంది.మజ్లీస్ నాయకులు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించుకుంటూ మిడ్ నైట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. అయితే.. మజ్లీస్ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలు బలంగా లేకపోవడంతో ఎంఐఎం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్నది ప్రతీ ఎన్నికల్లో నిరూపితం అవుతూనే ఉంది.కానీ.. ఈ సారి చాలా పార్టీల్లోనూ ఎంఐఎంకు సంబంధించిన వ్యక్తులకే టికెట్ రావడంతో.. వాళ్ళు ఆ పార్టీకే ప్రచారం చేస్తారా.. లేక.. ఎంఐఎం పార్టీకి ప్రచారం చేయిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పాతబస్తీ లాంటి ఏరియాల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. పాతబస్తీ గల్లీల్లో ప్రచారం చేసే సాహసం ఇతర పార్టీ నాయకులు చేయరనేది నిజం.ప్రచారానికి వెళ్లిన ప్రతీసారీ స్థానికులు అడ్డుకోవడం.. ఇక్కడికెందుకు వచ్చారంటూ ప్రశ్నించడం సహజం.. ఐదేళ్ల నుంచి తమ కష్టాలను పట్టించుకోలేదు గాని.. ఇప్పుడు ఎందుకు వస్తున్నారని నిలదీస్తారు. ఇతర పార్టీ నాయకులకు గల్లీలో మీటింగ్‌లు, బహిరంగ సభలు పెట్టే అవకాశం కూడా ఉండదు. దాంతో.. ఎంఐఎం అభ్యర్థుల గెలుపు సునాయాసం అవుతోంది.

జగనాసురుడి పాలనకు అంతం పలికి దసరా చేసుకుందాం

 సైకోని తరిమికొట్టినపుడే సామాన్యుడి బతుకులు బాగుపడతాయి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దేశమంతా రావణ దహనంతో దసరా చేసుకుంటున్నాయని…మనం జగనాసురుడి పాలనకు అంతం పలికి దసరా చేసుకుందాం అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.‘రాష్ట్రంలోని ఒక్కో మహిషాసుర మర్ధినిగా చెలరేగి జగన్ రెడ్డి అరాచకాలను అంతం చేసేందుకు పంతం పూనారు. జగనాసురుడి పీడ పోవాలని నినదిస్తూ విజయదశమి నాడు శపథం చేద్దాం. సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదంతో రాత్రి 7.00 నుండి 7.05 వరకు రాష్ట్రంలో ప్రతి గడపన నిలబడి శపథం పూనుదాం. జగన్ రెడ్డి అనే దుష్టుడితో జరిగే పోరులో జన బాందవుడు నారా చంద్రబాబుకి తోడుగా నిలిచి గెలిపించుకుందాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 339 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న హరీష్‌

బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ జల విహార్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయినర్స్, వార్ రూమ్ ఇన్ఛార్జ్‌లతో హరీష్‌రావు భేటి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పకొట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకొనిపోవడంలో వెనుక బడుతున్నామన్నారు. 2009 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చెయ్యలేదన్నారు.

నేపాల్‌ను భయపెట్టిన భూకంపం

నేపాల్ రాజధాని కఠ్మాండును ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. భూ ప్రకంపనలతో వణికిపోయిన జనం భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు తీశారు. భూకంప కేంద్రం ధడింగ్‌లో ఉన్నట్టు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన సంస్థ తెలిపింది.ఉదయం 7.39 గంటల సమయంలో భూకంపం సంభవించింది. బాగ్‌మతి, గండకి ప్రావిన్సుల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ భూంకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణ విషయంగా మారిపోయాయి. 2007లో ఇక్కడ సంభవించిన భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆజం ఖాన్‌కు కుటుంబానికి షాక్‌

రెండు జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత ఆజం ఖాన్‌, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంను జైలు అధికారులు రాంపూర్‌ జైలు నుంచి ఆదివారం తరలించారు. ఆజంఖాన్‌ను సీతాపూర్‌ జైలుకు, అబ్దుల్లాను హర్దోయ్‌ జైలుకు తరలించారు. విచారణ అనంతరం ఇద్దరిని వేర్వేరు ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఇదే కేసులో ఆజం ఖాన్‌ భార్య రాంపూర్‌ జైలులోనే ఉండనున్నారు.బర్త్‌ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఆజం ఖాన్‌, ఆయన భార్య తజిన్‌ ఫాత్మా, తనయుడు అబ్దుల్లాకు ఎంపీఎల్‌ఏ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అలాగే రూ.50వేల జరిమానా సైతం విధిస్తూ.. ముగ్గురిని జైలుకు తరలించాలని ఆదేశించింది. ఆ తర్వాత పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని రాంపూర్‌ జైలుకు తరలించారు. శనివారం రాత్రి ఆజం, అబ్దుల్లాను రాంపూర్‌ జైలు నుంచి తరలించాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయని.. ఈ మేరకు ఆజం ఖాన్‌ను సీతాపూర్‌, అబ్దుల్లా ఆజమ్‌ను హర్దోయ్ జైలుకు తరలించినట్లు ఎస్పీ రాజేశ్‌ ద్వివేది తెలిపారు. ఆజం భార్య తజిన్‌ ఫాత్మాను రాంపూర్‌లోనే ఉంచినట్లు పేర్కొన్నారు.అయితే, జైలు నుంచి బయటకు తీసుకువెళ్లే సమయంలో ఎన్‌కౌంటర్‌ చేసే అవకాశం ఉందని ఎస్పీనేత ఒకరు ఆరోపించారు. ఆజం కుటుంబం చాలాకాలంగా వేధింపులకు గురవుతోందన్నారు. ఇద్దరిని ఉదయం 5గంటలకు పరీక్షల పేరుతో రాంపూర్‌ జైలు నుంచి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, పోలీసు వాహనంలో కూర్చునేందుకు ఆజంఖాన్‌ నిరాకరించారు. దీంతో పోలీసులు ఆరోగ్య సమస్యలపై వివరించి నచ్చజెప్పారు. గతంలో ఎస్పీ సీనియర్‌ నేత తనకు ప్రాణహాని ఉందని చెప్పడం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z