DailyDose

న‌వ‌రాత్రి వేడుక‌ల్లో విషాదం-నేర వార్తలు

న‌వ‌రాత్రి వేడుక‌ల్లో విషాదం-నేర వార్తలు

న‌వ‌రాత్రి వేడుక‌ల్లో విషాదం

గుజ‌రాత్‌లో (Gujarat) న‌వరాత్రి వేడుక‌ల్లో విషాదం చోటుచేసుకుంది. గ‌ర్భా పెర్ఫామ్ చేస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంటల్లో ప‌ది మంది గుండెపోటుకు గురై మ‌ర‌ణించ‌డం ఆందోళ‌న రేకెత్తించింది. బాధితుల్లో టీనేజ‌ర్ల నుంచి మ‌ధ్య‌వ‌య‌సు వారు ఉన్నారు. బ‌రోడాలోని ద‌భోయ్‌కు చెందిన 13 ఏండ్ల బాలుడు కూడా గ‌ర్భా వేడుక‌లో గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశాడు.గ‌ర్భా ఆడుతూ క‌ప‌ద్వంజ్‌లో 17 ఏండ్ల యువ‌కుడు కుప్ప‌కూలాడు. గ‌త కొద్దిరోజులుగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగుచూశాయి. న‌వ‌రాత్రులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో 108 ఎమ‌ర్జెన్సీ అంబులెన్స్ సర్వీసుల‌కు 521 కాల్స్ రాగా, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో 609 కాల్స్ వ‌చ్చాయి. ఈ కాల్స్ అన్నీ గ‌ర్భా వేడుక‌లు జ‌రిగే సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 2 గంట‌ల మ‌ధ్యే రావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వంతో పాటు ఈవెంట్ నిర్వాహ‌కులు అప్ర‌మ‌త్తం కావాల‌నే హెచ్చ‌రిక పంపుతున్నాయి.గ‌ర్భా వేదిక‌ల‌కు సమీపంలోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్స్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది. ఎమ‌ర్జెన్సీ కేసుల విష‌యంలో స‌త్వ‌ర‌మే స్పందించేందుకు అంబులెన్స్‌లు వేగంగా వ‌చ్చేందుకు కారిడార్స్ ఏర్పాటు చేయాల‌ని కోరింది. మ‌రోవైపు గ‌ర్భా వేదిక‌ల వ‌ద్ద వైద్యులు, అంబులెన్స్‌ల‌ను సిద్ధంగా ఉంచేందుకు ఈవెంట్ నిర్వాహ‌కులు చ‌ర్య‌లు చేపుతున్నారు. సీపీఆర్ చేయ‌డంలో సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్వాహ‌కుల‌ను అధికారులు కోరుతున్నారు. మంచినీరు వంటి ప్రాధ‌మిక సౌక‌ర్యాల‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచాల‌ని కోరారు.

*  బ్యాంక్‌ మహిళా మేనేజర్‌ హత్య.. మరో మేనేజర్‌ ఆత్మహత్య

విల్లుపురం జిల్లా దిండివనం(Dindivanam) సమీపంలోని కేని పట్టులో బ్యాంక్‌ మహిళా మేనేజర్‌ హత్యకు గురయ్యారు. అదే సమయంలో హత్య జరిగిన ప్రాంతంలో మరో మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పుదుచ్చేరి రెడ్డియార్‌పాళయంలోని బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న మధుర దిండివనం సమీపంలో కారులో హత్యకు గురైన స్థితిలో కనిపించింది. ఈప్రాంతం సమీపంలో మరొకరు లారీ ఢీకొని మృతిచెందడం కలకలం రేపింది. లారీ ఢీకొని మృతిచెందిన వ్యక్తి గోపినాధ్‌ అని, ఆయన మరక్కాంణంలోని బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో తెలిసింది. మధురను గోపినాధ్‌ స్కూృ డ్రైవర్‌తో హతమార్చిన అనంతరం లారీ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. వీరివురు శుక్రవారం కొత్త బ్యాంక్‌ శాఖా కార్యాలయంలో జరిగిన పూజలకు హాజరయ్యారు. మరుసటిరోజు ఈ సంఘటన జరగడంపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.

పండుగపూట ఘోర ప్రమాదం

 పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బతుకమ్మ, దసరా పండుగ కోసం తండ్రి వెంకన్న.. కూతురు అనూష, అల్లుడిని ఇంటికి తీసుకెళ్లడానికి మహబూబాబాద్ వచ్చాడు. అనంతరం వారిని తీసుకొని బైకుపై ఇంటికి వెళ్తుండగా మడూర్ దగ్గర అతివేగంగా వచ్చిన ఓ కార్డు వారి బైకును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తండ్రి వెంకన్న, కూతురు అనూష అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అల్లుడి పరిస్థితి విషమంగా మారింది. గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు తారుమారు

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువు తారుమారు ఘటన కలకలం రేపుతోంది. మగ శిశువుకు బదులుగా ఆడశిశువును ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాటాయి గూడెం గ్రామానికి చెందిన ఉష, రాజేష్ దంపతులకు మూడవ సంతానంగా శనివారం (అక్టోబర్​ 21న) రాత్రి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువుకి జన్మనిచ్చింది. డెలివరీ చేసిన వైద్యులు, సిబ్బంది ఉష చేతి మీద ఆడ శిశువు అని మార్క్ వేశారు. ఉష భర్త, బంధువులకు ఆ పాపను అప్పగించారు. అనంతరం శిశువుని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు.అక్కడి నుండి శిశును తిరిగి బంధువులు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజన్​ నెలకొంది. తాము మగ శిశువును ఇస్తే ఆడ శిశువును ఇస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు విచారణ చేపట్టి ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. వైద్యులు మాత్రం ఆసుపత్రిలో శిశువు తారుమారు అయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు. 

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

 ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఓ మహిళా కానిస్టేబుల్‌ మృతదేహంపై 500కుపైగా గాయాల గుర్తులు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఆమె శరీరంపైౖకి ఆ గాయాలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది. ఉన్నావ్‌.. పోలీస్‌ లైన్‌లోని వసతిగృహంలో నివాసం ఉంటున్న మీను అనే మహిళా కానిస్టేబుల్‌.. గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి యత్నించింది. అక్కడే ఉన్నవారు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలో మహిళా కానిస్టేబుల్‌ ఉరివేసుకుని చనిపోయిందని, మృతదేహాంపై 500కుపైగా గాయాల గుర్తులు ఉన్నట్లు వెల్లడైంది.  అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అతడు మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీను.. తననుతాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

*   య‌జ‌మాని కారుతో  ప‌రారైన డ్రైవ‌ర్‌

 య‌జ‌మాని కారుతో పాటు రూ. 1.06 కోట్ల న‌గ‌దుతో ప‌రారైన డ్రైవ‌ర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని అంధేరాకు చెందిన బిల్డ‌ర్ వ‌ద్ద 17 ఏండ్లుగా ప‌నిచేస్తున్న డ్రైవ‌ర్ ఈ దురాగ‌తానికి తెగ‌బ‌డ్డాడు. నిందితుడిని మ‌హారాష్ట్ర‌లోని అకోలాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సంతోష్ చ‌వాన్‌గా గురించారు.కారు, న‌గ‌దుతో ప‌రారైన చ‌వాన్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో వాహ‌నాల‌ను మార్చేవాడు. నిందితుడి నుంచి చోరీ సొత్తులో అధిక భాగం స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. నిందితుడు బిల్డ‌ర్ కార్యాల‌యం నుంచి మ‌రో రూ. 75 ల‌క్ష‌లు కాజేశాడు.అలండిలోని ఓ గెస్ట్‌హౌస్‌లోకి ఎంట‌ర‌య్యేందుకు చ‌వాన్ త‌న బంధువు సాయంతో చెకిన్ అవ‌డంతో పాటు అత‌డి పేరిట మ‌రో సిమ్ కార్డ్ కొనుగోలు చేశాదు. త‌న బంధువు వ‌ద్ద రూ. 50 ల‌క్ష‌లు ఉంచి ఆపై మిగిలిన మొత్తంతో అకోలాకు వెళ్లాడు. నిఘా పెట్టిన పోలీసులు చ‌వాన్ క‌ద‌లిక‌ల‌ను ప‌సిగ‌ట్టి అకోలా వ‌ద్ద అత‌డిని అరెస్ట్ చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

విదేశీ యువతిని మోసం చేసిన యువకుడిని అరెస్టు

ప్రేమ పేరుతో విదేశీ యువతిని మోసం చేసిన యువకుడిని తిరుత్తణి పోలీసులు అరెస్టు చేశారు. భగవతాపురం గ్రామానికి చెందిన వెంకట కుప్పరాజు కుమారుడు తిరుమలై కృష్ణన్‌ (28) బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి మలేషియాకు చెందిన నాగజ్యోతి అనే యువతితో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా మిత్రులయ్యారు. కొద్దికాలానికి ప్రేమికులుగా మారారు.ఫలితంగా నాగజ్యోతి తరచూ ఇండియాకు వచ్చి చైన్నెలో తిరుమలై కృష్ణన్‌ను కలిసేది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. తనకు వేరొక యువతితో నిశ్చితార్థం జరిగిందని ఇకపై తనతో టచ్‌లో వద్దని తిరుమలై కృష్ణన్‌ చెప్పడంతో నాగజ్యోతి మలేషియా నుంచి తిరుత్తణి చేరుకుంది. తనను వివాహం చేసుకోవాలని నిలదీసింది. హత్యా బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి తిరుమలై కృష్ణన్‌ను అరెస్టు చేశారు.

మెదక్ లో పెను ప్రమాదం

మెదక్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వారం కిందట జరుగగా.. ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ. మెదక్‌ వెల్దుర్తి ( మం ) ఉప్పు లింగాపూర్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ నెల 13 న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.గాయపడిన వారిలో వీరమణి, పాండు, శ్యామల, వరలక్ష్మీ ఉన్నారు. అయితే.. ఈ వీరమణి, పాండు, శ్యామల, వరలక్ష్మీ నలు గురిని ఈ నెల 13 న ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ తరుణం లోనే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు వీరమణి, పాండు. అటు ఆస్పత్రిలో శ్యామల, వరలక్ష్మీ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దీనికి వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z