శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన దుర్గాష్టమి సందర్భంగా ఆదివారం భ్రమరాంబ అమ్మవారి మహాగౌరి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. నందిని వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ ముద్రలతోపాటు త్రిశూలం, ఢమరుకాన్ని ఆయుధాలగా ధరించి దివ్యకాంతులను ప్రసరింపజేస్తూ తెల్లని రంగులో శాంతస్వరూపిణిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.సాయంత్రం అక్క మహాదేవి అలంకారమండపంలో నందివాహనంపై ఆసీనులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రుత్వికులతో ప్రత్యేక పూజలు జరిపించినట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. అనంతరం ప్రాకారోత్సవంతోపాటు క్షేత్రపురవీధుల్లో అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన గోపురం నుంచి నందిమండపం మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఉత్సవం కన్నులపండుగగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులతో పాటు జానపదాలు, కోలాటాలు, చెక్కభజన, బీరప్పడోలు, నందికోలు, బుట్టబొమ్మలు, ఢమరుకనాదాలు, సప్తస్వర విన్యాసాలు, కర్ణాటక డప్పు కళాకారుల వీరంగ నృత్యాలతోపాటు వివిధ రకాల కళారూపాలతో సందడితో ఉత్సవం కొనసాగింది.
ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ, ఏకాంతసేవలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా దసరా దసరా సందర్భంగా సోమవారం రాజకుటుంబీకులు, చక్రవర్తుల నుంచి సాంప్రదాయంగా వస్తున్న స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించే ఆచారం కొనసాగుతుండగా.. ఏపీ ప్రభుత్వం తరఫున కార్మికశాఖ మంత్రి గుమ్మునూరి జయరాం.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారని ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, ఏఈవో మోహన్, హరిదాస్ అధికారులు, సిబంది పాల్గొన్నారు.శరన్నవరాత్రుల సందర్భంగా కంచికామకోటి పీఠం పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఆదేశాల మేరకు స్థానికి శంకరమఠం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించింది. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న శంకరమఠానికి చెందిన ప్రతినిధులకు ఈవో పెద్దిరాజు, ఉభయదేవాలయాల ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం పట్టువస్త్రాలను సమర్పించారు. ఈవోతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు విజయలక్ష్మి, సుబ్బరాయుడు, మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు ఉన్నారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అర్చక వేదపండితులు తిలకధారణ చేయగా.. ఈవో పెద్దిరాజుతో పాటు ఏఈవోలు మోహన్, హరిదాస్, అధికారులు పూలమాలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించి.. శేషవస్త్రం, జ్ఞాపికను అందించారు.
నిత్యాన్నదానికి రూ.లక్ష విరాళం…శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి చీరాలకు చెందిన సుజాత రూ.లక్ష విరాళం అందించారు. ఆలయ ఏఈవో ఫణిధర్‌కు విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. అనంతరం వారికి మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి.. ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
👉 – Please join our whatsapp channel here –