DailyDose

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్‌రెడ్డి-తాజా వార్తలు

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్‌రెడ్డి-తాజా వార్తలు

* రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్‌రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివని వ్యాఖ్యానించారు. బీజేపీకి రాజీనామా చేస్తూ రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.

* కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌ విడుదలపై బిగ్ అప్డేట్

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా ఈ రోజు పూర్తి అవుతుందని.. సెకండ్ లిస్ట్ రేపు విడుదల కానున్నట్లు తెలిపారు. 6 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఇబ్బందిగా ఉందని.. అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారని చెప్పారు. మొత్తం 119 సీట్లపై రేపు (గురువారం) ఉదయం ప్రకటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.అభ్యర్థులను సీఈసీ ఫైనల్ చేసే వరకు బయట మాట్లాడకూడదన్నారు. వామపక్షాలతో పొత్తులపైన ఇవాళ సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు. వామపక్షాలకు నాలుగు సీట్లు కేటాయించడమం అంటే తక్కువేమి కాదన్నారు. లెఫ్ట్ పార్టీస్ మిర్యాలగూడ సీటు అడిగారని.. కానీ అక్కడ కాంగ్రెస్ ఓటు ఎంత వరకు ట్రాన్సఫర్ అవుతుందనేది చూడాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 – 80 సీట్లు సాధింస్తుందని దీమా వ్యక్తం చేశారు.

* ఇజ్రాయెల్‌-పాలస్తీనా భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఇజ్రాయెల్‌-పాలస్తీనాపై జరిగిన సమావేశంలో పాకిస్థాన్‌ మరోసారి తన దుర్బుద్ధి బయటపెట్టింది. ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై చర్చించేందుకు ఏర్పాటైన భేటీలో పాక్ .. కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించటాన్ని భారత్‌ గట్టిగా తిప్పికొట్టింది. పాకిస్థాన్‌ చర్యను ధిక్కారంగా భావిస్తున్నట్లు తెలిపింది. దాయాది దేశం ప్రతిస్పందన గౌరవప్రదంగా లేదని పేర్కొంది.మధ్యప్రాచ్యంపై జరిగిన సమావేశంలో ఐరాసలో పాకిస్థాన్‌ దూత మునీర్‌ అక్రం.. కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించటంతో ఐరాసలో భారత్‌కు చెందిన డిప్యూటీ శాశ్వత ప్రతినిధి రవీంద్ర గట్టిగా బదులిచ్చారు. పాకిస్థాన్‌ పేరు ఎత్తకుండా తమ దేశ భూ భాగాల గురించి ప్రస్తావించటం ఓ దేశ ప్రతినిధి బృందానికి అలవాటుగా మారిందని చురకలు వేశారు. కశ్మీర్‌ తమ దేశంలో అంతర్భాగమే కాకుండా వీడదీయరాని భాగమని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ వ్యాఖ్యలను ధిక్కారంగా పరిగణిస్తామని, వారి మాటలు సమయానుకూలంగా లేవన్నారు.అంతకుముందు ఐరాసలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ మాట్లాడారు. పాక్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగించే లష్కర్‌-ఏ-తొయిబా లేదా హమాస్‌ ముంబయి లేదా కిబ్బర్జ్‌ బీరిలోని సామాన్య ప్రజలను లక్ష్యం చేసుకుంటే అవి చట్ట వ్యతిరేకమే కాకుండా సమర్థనీయం కావని తేల్చి చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం

ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీశ్‌ రావత్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.రావత్‌ మంగళవారం రాత్రి హల్ద్వానీ నుంచి ఉధమ్‌సింగ్‌ నగర్‌లోని కాశీపూర్‌కు కారులో బయలుదేరారు. బాజ్‌పూర్‌ వద్దకు రాగానే రావత్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మాజీ సీఎంను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ని డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం రావత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.రోడ్డు ప్రమాదం గురించి హరీశ్‌ రావత్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘హల్ద్వానీ నుంచి కాశీపూర్‌కు వెళ్తున్న సమయంలో నా కారు ప్రమాదానికి గురైంది. బాజ్‌పూర్‌లో ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నా సహచరులు కూడా బాగానే ఉన్నారు’ అని ట్వీట్‌ చేశారు.

* ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, వీహెచ్‌, కిషన్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అలయ్.. బలాయ్.. కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

* తలసాని ఇంటింటి ప్రచారం

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరుఫున మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తలసాని ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాంగోపాల్ పేట్ డివిజన్ లోని ఆవుల మంద, నాగన్న దేవిడి, కళాసిగూడ, బర్తన్ కాంపౌండ్, కండోజీ బజార్ తోపాటు తదితర ప్రాంతాల్లో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు.నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అనేక అభివృద్ధి పనులు చేశానని తలసాని తెలిపారు. అయితే, కొంతమంది మహిళలు తమకు ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు రాలేదని మంత్రిని అడగగా.. మీకు కూడా వస్తాయని, తొందరపకండా ఓపికతో ఉంటేనే అన్నీ వస్తాయని..ఏలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా మన చుట్టుపక్కల ఉన్న వారికి వచ్చినవి..కనుక మీకు కూడా అలానే వస్తాయని మంత్రి తలసాని మహిళలకు సర్ది చెప్పారు. అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే తనకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలను కోరారు.

* ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీకి కిషన్ రెడ్డి పవన్

రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అభ్యర్థుల రెండో జాబితాపై పార్టీలు దృష్టి సారించగా.. మరోవైపు బీజేపీకి చెందిన ముఖ్య నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీకి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో హస్తినాకు బయలుదేరిన నేతలు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.ఇరు పార్టీల మధ్య పొత్తుల అంశంపై చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో జనసేన 32 స్థానాల్లో పోటీకి చేస్తామని ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో ఓ దఫా కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీకి బయలుదేరిన కిషన్ రెడ్డి, పవన్‌ జాతీయ నాయకత్వం వద్దే పొత్తులు, ఎన్నికల్లో పరస్పర సహకారం, సీట్ల పంపకాలు వంటి అంశాలపై చర్చించి ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

* ఫ్రెంచ్ సినిమాలో అలనాటి తార రాధిక

టాలీవుడ్ సీనియర్ నటి రాధిక గురించి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఈ భామ ఓవైపు సినిమాలు.. మరోవైపు సీరియల్స్.. ఇంకోవైపు బుల్లితెరపై రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే ఈ భామ ఇప్పుడు విదేశీ సినిమాల్లో తన ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది రాధిక.ప్రస్తుతం ఫ్రాన్స్​లో ఉన్న రాధిక.. ఫ్రెంచ్ సినిమాలో నటిస్తున్నట్లు తన పోస్టులో చెప్పుకొచ్చింది. ఈ సినిమా అనుభూతి గురించి షేర్ చేసుకుంది. ‘‘సినీ కెరీర్‌లో కొత్త ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్‌ సినిమాలో నటిస్తున్నాను. తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నాను. కొత్త అనుభూతిని పొందనున్నా. ఈ విషయంలో నా భర్త శరత్‌కుమార్ ఎంతో ప్రోత్సహించారు’’ అంటూ శరత్​కుమార్​కు థ్యాంక్స్‌ చెప్పింది రాధిక. అలాగే షూటింగ్‌ సమయంలో దిగిన ఫొటోలను షేర్ చేసింది.ఈ ఫొటోలు, పోస్టు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రియాంక చోప్రా వంటి యంగ్ హీరోయిన్లే కాదు.. రాధిక వంటి సీనియర్ హీరోయిన్లు కూడా గ్లోబల్​ రేంజ్​లో సినిమాలు చేయడం సంతోషకరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాధికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి వ‌ల్ల నాకు ప్రాణ‌హాని

టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు టీ పీసీసీ ప్ర‌చార క‌మిటీ స‌భ్యులు కురువ విజ‌య్ కుమార్ ఫిర్యాదు చేశారు.డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంత‌రం విజ‌య్ కుమార్ మీడియాతో మాట్లాడారు. త‌మ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారు. త‌క్ష‌ణ‌మే విచార‌ణ జ‌రిపిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం 15 ఏండ్లుగా అహ‌ర్నిశ‌లు ప‌ని చేసిన త‌న‌ను కాద‌ని, నిన్న‌మొన్న పార్టీలో చేరిన వ్య‌క్తికి గ‌ద్వాల టికెట్ ఇచ్చార‌ని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లను డ‌బ్బుల‌కు, భూముల‌కు అమ్ముకుంటున్నార‌ని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ల విష‌యంలో రేవంత్ రెడ్డి డ‌బ్బులు తీసుకోక‌పోతే.. భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యంలో ప్ర‌మాణం చేయాల‌ని స‌వాల్ విసిరారు.రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేశామని, ఈ నేప‌థ్యంలో ఆయ‌న అనుచరులు త‌మ‌ను భౌతికంగా వేధిస్తున్నార‌ని విజ‌య్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ప‌ని చేసి, గ‌త 15 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ప‌ని చేస్తుంటే, ఇవాళ అకార‌ణంగా త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశార‌ని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన త‌మ‌ను అణ‌గ‌దొక్కడానికి రేవంత్ కుట్రలు చేస్తున్నార‌ని విజ‌య్ కుమార్ మండిప‌డ్డారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z