DailyDose

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు ప్రధానిని దిల్లీలో కలిశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ప్రధాని స్వయంగా అంగీకరించారు. మూడంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయం భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్‌ నృపేంద్ర మిశ్రా ఇటీవల తెలిపారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.. ప్రధాని ట్వీట్‌
‘‘ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

ప్రధానితో సమావేశం అనంతరం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ మాట్లాడారు. 2024 జనవరి 22న ఆలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించినట్లు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z