Business

బ్యాంకు ఉద్యోగులు త్వరలో శుభవార్త వినే అవకాశం-వాణిజ్య వార్తలు

బ్యాంకు ఉద్యోగులు త్వరలో శుభవార్త వినే అవకాశం-వాణిజ్య వార్తలు

* బ్యాంకు ఉద్యోగులు త్వరలో శుభవార్త వినే అవకాశం

బ్యాంకు ఉద్యోగులు త్వరలో గుడ్‌న్యూస్‌ వినే అవకాశం కల్పిస్తోంది. వేతన పెంపుతో (Wage hike) పాటు వారానికి ఐదు రోజుల పని విధానం (5 day work) త్వరలో అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది.బ్యాంకు యాజమాన్యాలతో కూడిన ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (IBA) ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపునకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, అంతకంటే ఎక్కువ వేతనం పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు తెలిసింది. కొవిడ్‌ సమయంలోనూ అవిశ్రాంతంగా సేవలందించడం, ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడంతో పాటు ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు పెరిగిన నేపథ్యంలో ఆ మేర ఉద్యోగులకు మెరుగైన వేతన పెంపు కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు ఐదు రోజుల పని విధానం గురించి ప్రభుత్వానికి ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఇది వరకే ప్రతిపాదనలు పంపింది. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇప్పటికే ఎల్‌ఐసీలో 5 రోజుల పని విధానం అమలవుతోంది. దీంతో బ్యాంకులు, ఉద్యోగ సంఘాలు ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. ప్రస్తుతం బ్యాంకులకు రెండో, నాలుగో శనివారం సెలవు దినంగా ఉంది. ఒకవేళ కొత్త పని విధానానికి ఆమోదం లభిస్తే.. బ్యాంకులు కేవలం వారంలో ఐదు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

* భారతీయ కంపెనీగా అవతరించి అరుదైన ఘనతను సొంతం

రాజస్థాన్‌కు చెందిన ‘సహస్ర సెమీకండక్టర్స్’ (Sahasra Semiconductors) మెమరీ చిప్‌లను ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో భివాడి జిల్లాలోని సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి.. వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పటికే మొదటి షిప్‌మెంట్ చేసింది.2023 చివరి నాటికి కంపెనీ భివాడి యూనిట్ 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, 2024లో ఇది మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సహస్ర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ‘అమృత్ మన్వానీ’ వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మైక్రో ఎస్‌డి కార్డ్‌లను విక్రయించే మొదటి కంపెనీగా మారినందుకు ఆనందంగా ఉందని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి స్పందన లభిస్తోందని మన్వానీ ఈ సందర్భంగా చెప్పారు.సహస్ర సెమీకండక్టర్స్ రెండు ప్రముఖ ప్రభుత్వ కార్యక్రమాల (PLI, SPECS) నుంచి ఆమోదం పొందింది. అంతే కాకుండా కంపెనీ తన తయారీ సౌకర్యాన్ని విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.సెమీకండక్టర్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్లోబల్ చిప్‌మేకర్ మైక్రాన్, గుజరాత్‌లో కొత్త అసెంబ్లీ అండ్ టెస్ట్ సదుపాయాన్ని స్థాపించడానికి 825 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2024 నాటికి ఉత్పత్తి అధికమవుతుందని, తద్వారా కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ తగ్గుతుందని భావిస్తున్నారు.

* మరోసారి భారీ తగ్గింపులతో Flipkart దీపావళి సేల్

ఈ కామర్స్ సైట్లు పండగ సీజన్‌ వచ్చిందంటే చాలు భారీ తగ్గింపులు, డిస్కౌంట్లతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తాయి. ఇప్పటికే దసరా పండగకు ప్రత్యేక తగ్గింపు సేల్‌ను తెచ్చిన ఫ్లిప్‌కార్ట్ తరువాత రాబోయే దీపావళి పండగను పురస్కరించుకుని ‘బిగ్ దివాళి’ సేల్‌ను ప్రకటించింది. ఇది నవంబర్ 2 నుంచి 11 వరకు జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం ఈ సేల్ ఒక రోజు ముందుగా అంటే నవంబర్ 1 నుంచి మొదలవుతుంది.కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డ్‌లు, EMI ల కనీస లావాదేవీ రూ.5000 లపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంది. Paytm పై 10శాతం క్యాష్‌బ్యాక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, హెడ్‌ఫోన్స్, దుస్తులు, బ్యూటీకేర్ ఉత్పత్తులు, ఇంటికి అవసరమైన పలు రకాల వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్‌న్యూస్‌

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda).. బీఓబీ లైట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ పేరిట లైఫ్‌టైమ్‌ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ను తీసుకొచ్చింది. బీఓబీ పండగ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ అకౌంట్‌ను ప్రకటించింది. మినిమమ్‌ బ్యాలెన్స్‌ అవసరం లేకుండానే ఈ ఖాతాతో బ్యాంకింగ్‌ సేవలను ఆనందించొచ్చని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ అకౌంట్‌తో పాటు కస్టమర్లు లైఫ్‌టైమ్‌ ఉచిత రూపే ప్లాటినమ్‌ డెబిట్‌ కార్డును కూడా పొందొచ్చు. దీనికి త్రైమాసికంలో సగటు బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయాలి. అలాగే అర్హత ఆధారంగా లైఫ్‌టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డును కూడా జారీ చేస్తారు. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్‌ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, మేక్‌ మై ట్రిప్‌, అమెజాన్‌, బుక్‌ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్‌ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది.ఇది లైఫ్‌టైమ్‌ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌. 10 ఏళ్లు పైబడిన వారు మొదలుకొని భారతీయ పౌరులెవరైనా ఈ ఖాతాను తెరవొచ్చు. ఫ్రీ రూపే ప్లాటినమ్‌ డెబిట్‌ కార్డు అందిస్తారు. మెట్రో/అర్బన్‌లో రూ.3వేలు; సెబీ అర్బన్‌లో రూ.2వేలు; గ్రామీణ శాఖల్లో రూ.1000 చొప్పున త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హతను బట్టి లైఫ్‌టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డును కూడా జారీ చేస్తారు. ఒక ఆర్థిక సవత్సరంలో 30 చెక్‌ లీవ్స్‌ ఉచితంగా లభిస్తాయి.

* వీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

భారతీయ ద్విచక్ర వాహన సంస్థ TVS ఆధునిక-రెట్రో మోటార్‌సైకిల్ రోనిన్ ప్రత్యేక ఎడిషన్‌ను ఈరోజు అంటే అక్టోబర్ 27న విడుదల చేసింది. కొత్త రోనిన్ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 1,72,700లుగా పేర్కొంది. ఎక్స్-షోరూమ్, స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.అయితే, ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ స్పెక్, ఫీచర్లు రోనిన్ టాప్-స్పెక్ వేరియంట్ వలెనే ఉంటాయి. కొత్త ఎడిషన్ కొత్త ట్రిపుల్ టోన్ గ్రాఫిక్ స్కీమ్‌ను కలిగి ఉంది. ఇందులో బూడిద రంగును ప్రాథమిక షేడ్‌గా, తెలుపును సెకండరీ షేడ్‌గా,మూడవ టోన్‌గా ఎరుపు గీతను కలిగి ఉంటుంది.మోటార్‌సైకిల్‌పై ‘R’ లోగో నమూనా పొందుపరిచారు. వీల్ రిమ్‌లు ‘TVS రోనిన్’ బ్రాండింగ్‌తో వస్తాయి. అయితే బైక్ దిగువ సగం పూర్తిగా నల్లగా ఉంటుంది. బ్లాక్ థీమ్‌తో హెడ్‌ల్యాంప్ బెజెల్స్‌కు కూడా జోడించబడింది.పనితీరు కోసం, TVS రోనిన్ 225.9cc సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7750rpm వద్ద 20.2 bhp శక్తిని, 3750rpm వద్ద 19.93 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ బైక్‌లో కస్టమర్లు గరిష్టంగా 120 Kmph వేగంతో దూసుకుపోతారని కంపెనీ పేర్కొంది. TVS రోనిన్: బ్రేకింగ్, సస్పెన్షన్.. హార్డ్‌వేర్ స్పెక్స్ ఇది రైడింగ్ సౌకర్యం కోసం తలక్రిందులుగా ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున 7-దశల ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం, బైక్‌లో 300 mm ఫ్రంట్ డిస్క్, వెనుక చక్రం వద్ద 240 mm రోటర్ ఉంటాయి. ఈ బైక్ భారత మార్కెట్లో హోండా CB300Rకి పోటీగా ఉంటుంది. TVS రోనిన్: ఫీచర్లు.. రోనిన్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, బైక్ ఫుల్-LED లైటింగ్, TVS స్మార్ట్ X కనెక్ట్ టెక్నాలజీ, బ్లూటూత్ మాడ్యూల్‌తో కూడిన ఆఫ్-సెట్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు ABS మోడ్‌లు – రెయిన్ అండ్ రోడ్, స్లిప్పర్ క్లచ్, సాంకేతికతను కలిగి ఉంటుంది.

* ఎక్స్ నుంచి ఆదాయాన్ని పెంచుకోవడానికి రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు

సోషల్ మీడియా దిగ్గజం ‘X(ఎక్స్)’ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్తగా రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ వేదికగా ప్రకటించింది.ఈ రెండు ప్లాన్లు కూడా ప్రీమియం+, బేసిక్ ప్రీమియం. వీటికి ప్రత్యేక ధరను నిర్ణయించారు. బేసిక్ ప్రీమియం ధర నెలకు రూ.243.75($3). దీనిలో బ్లూటిక్ మార్క్ ఉండదు. పోస్ట్‌లను ఎడిటింగ్ చేసుకోవచ్చు. పొడవైన వీడియోలు, టెక్ట్స్‌లను పోస్ట్‌ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.అదే ప్రీమియం+ ధర నెలకు రూ.1,300($16). ఈ ప్లాన్‌లో ప్రధానంగా రిప్లై బూస్ట్ ఎక్కువగా ఉంటుంది. యూజర్లతో పాటు, వారిని ఫాలో అవుతున్న వారి నుంచి ప్రకటనలు తొలగిస్తారు. అలాగే, క్రియేటర్ టూల్స్‌కు ఎక్కువ యాక్సెస్ లభిస్తుంది. ఈ కొత్త ప్లాన్ల ద్వారా కంపెనీ తన ఆదాయాన్ని భారీగా పెంచుకోనుంది. ప్రస్తుత ఈ ప్లాన్లను వెబ్‌లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు.

* 6జీ టెక్నాలజీపై నోకియా డెమో

న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్‌లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్‌సీఆర్‌టీసీ, ప్రైవేట్ వైర్‌లెస్ నెట్‌వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్‌వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్‌), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది.నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది.నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) దిల్లీ నుంచి మీరట్‌ రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కోసం ఒక ప్రైవేట్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్‌స్టోమ్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్‌టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్‌లెస్ నెట్‌వర్క్.నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్‌పోస్ట్‌తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

* బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు త్వరలో ప్రారంభం

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ సీఎండీ పీకే పూర్వార్‌ తెలిపారు. తొలుత పంజాబ్‌ నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లడారు.బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు పుర్వార్‌ తెలిపారు. తొలి దశలో పంజాబ్‌లో కొన్ని చోట్ల ఈ సేవలు ప్రారంభించి.. దశలవారీగా ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తామని చెప్పారు. 2024 జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 4జీ విస్తరణ పూర్తయ్యాక 5జీ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని 4జీ కోసం వినియోగించినట్లు పుర్వార్‌ తెలిపారు. 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేసే బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌, ప్రభుత్వరంగ ఐటీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. 5జీ సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన స్పెక్ట్రమ్‌ అందుబాటులో ఉందని చెప్పారు

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z